VVS Laxman: భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం త్వరలోనే ముగియనుండటంతో కొత్త హెడ్ సెలెక్టర్ ఎవరనే దానిపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. సెప్టెంబర్ 2026తో అగార్కర్ ప్రస్తుత పదవీకాలం పూర్తి కానుంది. దీనితో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ముందు ఇప్పుడు పెద్ద సవాలు నిలిచింది — అగార్కర్ సాధించిన విజయాలకు గుర్తింపుగా ఆయన పదవీకాలాన్ని పొడిగించడమా, లేక అత్యంత కీలకమైన 2027 వన్డే ప్రపంచ కప్‌కు జట్టును ఎంపిక చేసేందుకు కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించడమా?

ఆగస్టు ప్రారంభంలో అగార్కర్ కాంట్రాక్ట్ పొడిగింపుపై స్పష్టత లేదని, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ప్రస్తుత అధిపతి, భారత మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను ఆ పదవిలోకి తీసుకురావాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఆ పదవిని చేపట్టేందుకు లక్ష్మణ్ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

అయితే భారత క్రికెట్‌లో ఇలాంటి పరిణామాలు రాత్రికి రాత్రే మారిపోతుంటాయి. గతంలో రాహుల్ ద్రవిడ్ కూడా టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి చూపలేదు, కానీ ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు. అలాగే 2023 వరల్డ్ కప్ తర్వాత కోచ్‌గా కొనసాగకూడదని భావించినా, రోహిత్ శర్మ కోరిక మేరకు కొనసాగారు. కాబట్టి సెలెక్టర్ పదవి విషయంలో కూడా ఏమైనా జరగొచ్చు. ఒకవేళ అగార్కర్‌కు పొడిగింపు లభించకపోతే లేదా లక్ష్మణ్ ఒప్పుకోకపోతే, ఇతర మాజీ భారత క్రికెటర్లు కూడా ఈ రేసులో ఉన్నారు.

2024లో టీమిండియా హెడ్ కోచ్ రేసులో లక్ష్మణ్ పేరు వినిపించినప్పటికీ ఆయన దానిని నిరాకరించి, CoE చీఫ్‌గా రెండేళ్ల బాధ్యతలను స్వీకరించారు. ఆదివారం రోజున బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్వయంగా CoEని సందర్శించి లక్ష్మణ్‌తో మాట్లాడటంతో పాటు, భారత జట్టులో ఆటగాళ్ల గాయాల సమస్యలపై సమీక్షించారు.

మరోవైపు గౌతమ్ గంభీర్‌పై కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, నిరంతర ప్రయాణాలు మరియు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొనే బాధ్యత కావడంతో టీమిండియా కోచ్ లేదా సెలెక్షన్ పదవుల వైపు రావడానికి ఎవరూ అంత త్వరగా ముందుకు రావడం లేదు. ఏది ఏమైనా, భారత క్రికెట్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్న వేళ రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story