Riyan Parag: ఐపీఎల్‌లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఆటగాళ్లలో రియాన్ పరాగ్ ఒకరు. మైదానంలో తన దూకుడుతో వార్తల్లో నిలిచే ఈ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో చేసిన పనికి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. నిబంధనలను అతిక్రమించి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన పరాగ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలు తీసుకుంది.

మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న రియాన్ పరాగ్, ఈ-సిగరెట్ (వేపింగ్‌) తాగుతూ కెమెరా కంటికి చిక్కాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించాయి. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా, డ్రెస్సింగ్ రూమ్‌లో పొగ తాగడంపై క్రికెట్ లవర్స్,విశ్లేషకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ, ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవెల్-1 నిబంధనను పరాగ్ ఉల్లంఘించినట్లు తేల్చింది. ఆటగాళ్లు ,జట్టు అధికారుల కోసం రూపొందించిన క్రమశిక్షణా మార్గదర్శకాలను పక్కన పెట్టినందుకు గాను, అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. కేవలం జరిమానాతోనే సరిపెట్టకుండా, అతని ఖాతాలో ఒక 'డీమెరిట్ పాయింట్' కూడా చేర్చింది.

మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ ఈ విషయాన్ని విచారించగా, రియాన్ పరాగ్ తన తప్పును అంగీకరించినట్లు బీసీసీఐ అధికారిక ప్రకటనలో తెలిపింది. రిఫరీ విధించిన శిక్షను తాను అంగీకరిస్తున్నానని, లెవెల్-1 నిబంధన ఉల్లంఘన నిజమేనని పరాగ్ ఒప్పుకోవడంతో ఫార్మల్ విచారణ అవసరం లేకుండానే ఈ చర్యలు తీసుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story