CSK అభిమానులకు అతిపెద్ద శుభవార్త

A Big Good News for CSK Fans: ఐపీఎల్ (IPL) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఊరటనిచ్చే, ఉత్సాహపరిచే వార్త ఇది. తమ ప్రియతమ కెప్టెన్, లెజెండరీ ఆటగాడు ఎం.ఎస్. ధోని ఐపీఎల్ భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ తాజాగా ధోని ఐపీఎల్ ప్రయాణంపై కీలక ప్రకటన చేశారు. ఒక కార్యక్రమంలో పిల్లలతో సంభాషిస్తున్నప్పుడు ధోని రిటైర్మెంట్ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానం ఇచ్చారు. లేదు, ఈ (2026) ఐపీఎల్ కోసం అతను రిటైర్ కావడం లేదు. ధోని ఖచ్చితంగా ఆడతాడని తెలిపారు. ప్రతి సీజన్ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్ గురించి పుకార్లు వస్తున్నప్పటికీ, ఈ తాజా ప్రకటనతో ధోని మరోసారి పసుపు జెర్సీలో మెరవడం ఖాయమని తేలిపోయింది. ఇది చెన్నైలోని 'తలా' అభిమానులకు పెద్ద పండుగ వార్తగా మారింది. ధోని సారథ్యంలోనే సీఎస్‌కే జట్టు ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ధోని 2026లో ఆడటం ఖాయమని సీఈఓ స్పష్టం చేసినప్పటికీ, 'ధోని ఎప్పుడు రిటైర్ అవుతారు?' అని పిల్లలు అడిగిన మరో ప్రశ్నకు కాశీ విశ్వనాథన్ సరదాగా సమాధానం చెప్పారు. "నేను అతన్ని అడిగి మీకు తిరిగి చెబుతాను!" అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ విషయంపై ధోని స్వయంగా స్పందించకపోయినా, CSK ఫ్రాంచైజీ అధినేత చేసిన ఈ ప్రకటనతో ధోని ఫిట్‌గా ఉంటే 2026 ఐపీఎల్‌లో కూడా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగడం పక్కా అని తేలిపోయింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story