లారా తీవ్ర విమర్శలు..

Brian Lara's Strong Criticism: వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా వెస్టిండీస్ జట్టు ప్రస్తుత పరిస్థితి, ఆటగాళ్ళ నిబద్ధతపై తరచూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ గా వెస్టిండీస్ క్రికెట్ జట్టుపై లారా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వైఫల్యం కారణంగానే జట్టు ఈ పరిస్థితికి చేరుకుందని లారా తీవ్రంగా విమర్శించారు.లీగ్‌లలో ఆడి ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే ప్రతిభావంతులైన ఆటగాళ్లను జాతీయ జట్టులో కొనసాగేలా చేయడంలో బోర్డు పూర్తిగా విఫలమైంది అని ఆయన ఆరోపించారు.

ఆటగాళ్లకు జాతీయ జట్టు పట్ల నిబద్ధత ఉండేలా చూసుకోవడానికి ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి ఇతర దేశాల క్రికెట్ బోర్డుల నుండి నేర్చుకోవాలని ఆయన సూచించారు. ఆయా దేశాలు తమ ఆటగాళ్లకు పెద్ద మొత్తంలో రిటైనింగ్ ఫీజులు చెల్లిస్తున్నాయి, అందువల్ల వారికి ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడే అవసరం తక్కువగా ఉంటుందని చెప్పారు.

కేవలం 29 ఏళ్ల వయసులోనే నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం వెస్టిండీస్ క్రికెట్‌కు ఒక హెచ్చరికగా లారా అభివర్ణించారు.పూరన్ వంటి యువ, ప్రతిభావంతుడైన ఆటగాడు అంత తొందరగా రిటైర్ కావడానికి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఐదు, ఆరు ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడి ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనే కారణమని ఆయన పరోక్షంగా అన్నారు. ఆటగాళ్లు తమ కుటుంబాల ఆర్థిక భద్రత కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీన్ని అర్థం చేసుకోగలమని కూడా అన్నారు.

ప్రస్తుత వెస్టిండీస్ ఆటగాళ్లకు క్రికెట్ పట్ల, దేశం పట్ల నిబద్ధత ఉందా అని లారా ప్రశ్నించారు. వారు నిజంగా వెస్టిండీస్ కోసం ఆడాలనుకుంటున్నారా? అని ప్రస్తుత కెప్టెన్ రోస్టన్ చేజ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. 30-40 ఏళ్ల క్రితం తమకు మెరుగైన సౌకర్యాలు లేకపోయినా, వెస్టిండీస్ కోసం ఆడేందుకు ఎంతో ప్యాషన్ ఉండేదని, ప్రస్తుత ఆటగాళ్లలో ఆ స్ఫూర్తి లోపించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story