Captain Harman’s Key Comments: మా ఓటమికి కారణమదే.. కెప్టెన్ హర్మన్ కీలక కామెంట్స్
కెప్టెన్ హర్మన్ కీలక కామెంట్స్

Captain Harman’s Key Comments: మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. ఆదివారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై మూడు వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 48.5 ఓవర్లలో 330 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా, మన బౌలర్లు ఆసీస్‌ను కట్టడి చేయలేకపోయారు. ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి 49 ఓవర్లలోనే ఈ టార్గెట్‌ను ఛేదించింది. ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ (142 పరుగులు) అద్భుత శతకంతో విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత బౌలర్లలో శ్రీచరణి మూడు, దీప్తి శర్మ, అమన్ జ్యోత్ తలా రెండు వికెట్లు తీశారు.
ఓపెనర్ల మెరుపులు
అంతకుముందు భారత ఓపెనర్లు స్మృతి మంధాన (80 పరుగులు), ప్రతికా రావల్ (75 పరుగులు) అర్ధ సెంచరీలతో చెలరేగి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆసీస్ బౌలర్ సదర్లాండ్ 5 వికెట్లు తీసి రాణించింది.
ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడింది. బ్యాటింగ్ బాగా చేసినా, ఆఖర్లో రిథమ్ కోల్పోవడం వల్లే ఓడిపోయామని ఆమె చెప్పింది.
"బ్యాటింగ్ బాగా చేశాం. కానీ మరో 30-40 పరుగులు అదనంగా చేసింటే గెలిచేవాళ్లం. చివరి 6-7 ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయాం. అందుకే అనుకున్నంత స్కోరు చేయలేకపోయాం. గత మ్యాచ్‌లతో పోలిస్తే 40 ఓవర్ల వరకు మా బ్యాటింగ్ బాగుంది. తిరిగి బలంగా పుంజుకోవడం మాకు ముఖ్యం. తదుపరి రెండు మ్యాచ్‌లు మాకు చాలా కీలకం" అని హర్మన్ తెలిపింది
శ్రీచరణి బౌలింగ్‌పై ప్రశంసలు
బౌలర్ శ్రీచరణి ప్రదర్శనను హర్మన్ ప్రత్యేకంగా ప్రశంసించింది. "చరణి నిజంగా అద్భుతంగా ఆడింది. హీలీ లాంటి బ్యాటర్‌ను కూడా కట్టడి చేయగలిగింది. ఆమెపై మాకు చాలా నమ్మకం ఉంది," అని తెలిపింది. ఒకట్రెండు ఓటములతో జట్టు కాంబినేషన్ గురించి మాట్లాడటం సరికాదని, తదుపరి మ్యాచ్‌లపై దృష్టి పెడతామని హర్మన్ తెలిపింది.
