Chamari Athapaththu: శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు చరిత్ర సృష్టించారు. సెప్టెంబర్ 2న ఇండోనేషియాతో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో ఆమె ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి అరుదైన ఘనత సాధించారు. పురుషులు, మహిళలు కలిపి ఆసియా కప్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఆటపట్టు రికార్డు నెలకొల్పారు.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఆటపట్టు కేవలం 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టారు. దీంతో ఆసియా కప్ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డు ఆమె సొంతమైంది. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్థాన్‌కు చెందిన జావేరియా ఖాన్ పేరిట ఉండేది. 2008 మహిళల ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై ఆమె ఆరు వికెట్లు పడగొట్టారు.

ఆసియా కప్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆరు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గానూ ఆటపట్టు నిలిచారు. అంతకుముందు మహిళల టోర్నీలో ముగ్గురు పాకిస్థాన్ బౌలర్లు, ఒక థాయ్‌లాండ్ బౌలర్ ఐదు వికెట్లు తీసుకున్నారు. పురుషుల టీ20 ఆసియా కప్‌లో భారత్‌కు చెందిన భువనేశ్వర్ కుమార్ మాత్రమే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశారు.

అంతేకాకుండా 7/5 గణాంకాలతో శ్రీలంక తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన రికార్డును కూడా ఆటపట్టు బద్దలు కొట్టారు. ఆమె అద్భుత బౌలింగ్ కారణంగా ఇండోనేషియా కేవలం 49 పరుగులకే ఆలౌటైంది.

తొలుత శ్రీలంక 125 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఇండోనేషియాను 49 పరుగులకే కట్టడి చేసిన శ్రీలంక 75 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో యూఏఈ వేదికగా జరుగుతున్న ఎనిమిది జట్ల ఆసియా కప్‌లో శ్రీలంక సెమీఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకుంది.

టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన ప్రపంచంలో రెండో కెప్టెన్‌గా కూడా ఆటపట్టు నిలిచారు. అంతకుముందు అర్జెంటీనా కెప్టెన్ అలిసన్ స్టాక్స్ ఈ ఘనత సాధించారు. 2022 అక్టోబర్ 14న పెరూపై జరిగిన మ్యాచ్‌లో స్టాక్స్ 3.4 ఓవర్లలో కేవలం మూడు పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టారు.

Next Story