Chennai Knocked Out of IPL: ఐపీఎల్-19లో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్, ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ చావో రేవో పోరులో గుజరాత్ టైటాన్స్ చెలరేగిపోవడంతో.. చెన్నై ప్లేఆఫ్ ఆశలు ఆవిరైపోయాయి.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు.. చెన్నై బౌలర్లపై నిర్దయాత్మకంగా విరుచుకుపడ్డారు. ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్టేడియం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించారు. సాయి సుదర్శన్ కేవలం 53 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేయగా.. శుభ్‌మన్ గిల్ 37 బంతుల్లోనే 64 రన్స్ చేసి అదరగొట్టాడు. ఇక ఆఖర్లో జోస్ బట్లర్ కేవలం 27 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో.. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది.

230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. ఒత్తిడిని తట్టుకోలేక సీఎస్కే బ్యాటర్లు క్రీజులోకి రావడం, వెళ్లడం అన్నట్లుగా అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. గుజరాత్ బౌలర్ల ధాటికి చెన్నై టాప్ ఆర్డర్ కుప్పకూలింది. శివమ్ దూబే 40 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా.. అతనికి మిగతా బ్యాటర్ల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 26 పరుగులిచ్చి 3 వికెట్లు, కగిసో రబాడ 32 పరుగులిచ్చి 3 వికెట్లు, మరియు రషీద్ ఖాన్ కేవలం 18 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి చెన్నై నడుం విరిచారు.

దీంతో.. చెన్నై సూపర్‌ కింగ్స్ కేవలం 13.4 ఓవర్లలోనే 140 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. ఫలితంగా ఈ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 89 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో చెన్నై బ్యాటింగ్ లైన్‌అప్‌ను దెబ్బతీసిన మహ్మద్ సిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ టోర్నమెంట్ నుండి అధికారికంగా నిష్క్రమించగా, గుజరాత్ టైటాన్స్ మాత్రం ఈ విజయంతో తమ సత్తా చాటుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story