ఆయుష్ మాత్రే అవుట్

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ఆసక్తికరంగా సాగుతున్న వేళ.. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, యువ సంచలనం ఆయుష్ మాత్రే గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం 'ఎక్స్' వేదికగా అధికారికంగా ధృవీకరించింది. దీంతో కోట్లాది మంది సీఎస్‌కే అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
అసలేం జరిగిందంటే.. ఏప్రిల్ 18న సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో.. ఒక పరుగు కోసం ప్రయత్నిస్తుండగా ఆయుష్ మాత్రే ఎడమ తొడ కండరాలు పట్టేశాయి. నొప్పితో మైదానంలోనే విలవిలలాడిన అతడు.. ఫిజియో సాయంతో బయటకు వెళ్ళాడు. పరీక్షల అనంతరం ఆ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. అతడు కోలుకోవడానికి కనీసం 6 నుంచి 12 వారాల సమయం పడుతుందని వైద్యులు తేల్చారు. అంటే ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి మాత్రే అందుబాటులో ఉండటం అసాధ్యమని తేలిపోయింది."
ఈ సీజన్‌లో ఆయుష్ మాత్రే చెన్నైకి వెన్నెముకలా నిలిచాడు. రాజస్థాన్, ఆర్సీబీ మ్యాచ్‌లను పక్కన పెడితే.. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ తన మార్క్ చూపించాడు. పంజాబ్‌పై 73 పరుగులు, ఢిల్లీపై 59 పరుగులు, కేకేఆర్‌పై 38, ఎస్ఆర్‌హెచ్‌పై 30 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన ఆరంభాలను ఇచ్చాడు. మొత్తం 177.87 స్ట్రైక్ రేట్‌తో 201 పరుగులు సాధించి.. డెత్ ఓవర్లలోనే కాదు, పవర్‌ప్లేలోనూ ప్రత్యర్థి బౌలర్లను వణికించాడు.నిజానికి ఆయుష్ మాత్రే ప్రయాణం చాలా ప్రత్యేకం. 2025 సీజన్ మధ్యలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడినప్పుడు.. ఒక ఆపద్బాంధవుడిలా జట్టులోకి వచ్చాడు. ఆ తొలి సీజన్‌లోనే కేవలం 7 మ్యాచ్‌ల్లో 190 స్ట్రైక్ రేట్‌తో 240 పరుగులు చేసి.. తనేంటో నిరూపించుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ లేని లోటును తీరుస్తూ.. సీఎస్‌కే నమ్మకమైన ఓపెనర్‌గా ఎదిగాడు.
ఇప్పుడు అత్యంత కీలకమైన సమయంలో అద్భుత ఫామ్‌లో ఉన్న మాత్రే దూరం కావడం.. చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ వేటకు పెద్ద అడ్డంకిగా మారింది. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు అనేది ఇప్పుడు మేనేజ్‌మెంట్‌కు పెద్ద ప్రశ్నగా మారింది.

