Ranji Trophy: రంజీ ట్రోఫీ 2026–27 సీజన్‌లో పరుగుల వరద పారిస్తూ సరికొత్త సంచలనాలకు కేంద్రబిందువుగా మారాడు 29 ఏళ్ల బ్యాటర్‌ చిన్మయ్ సుతార్. కొద్ది రోజుల క్రితమే నాగాలాండ్‌పై అజేయంగా 400 పరుగులు బాది దేశీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన ఈ మిజోరం ఆటగాడు.. తాజాగా మేఘాలయపై మరో అద్భుత శతకం బాదాడు. తద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో శతాబ్దానికి పైగా చెక్కుచెదరకుండా ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం విల్ పాన్స్‌ఫోర్డ్ ప్రపంచ రికార్డును తిరగరాశాడు.

తొలి 4 ఇన్నింగ్స్‌ల్లోనే 659 పరుగులు.. పాన్స్‌ఫోర్డ్ రికార్డు బద్దలు

నడియాడ్ వేదికగా మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో చిన్మయ్ సుతార్ 215 బంతుల్లో 12 ఫోర్లతో 125 పరుగులు సాధించాడు. ఇది అతనికి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో వరుసగా రెండో సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌తో సుతార్ తన మొదటి నాలుగు ఫస్ట్-క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏకంగా 659 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

దీంతో 1920ల్లో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ విల్ పాన్స్‌ఫోర్డ్ తన తొలి నాలుగు ఇన్నింగ్స్‌లలో నెలకొల్పిన 616 పరుగుల ఆల్‌టైమ్ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. మొదటి నాలుగు ఫస్ట్-క్లాస్ ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా సుతార్ చరిత్ర పుటల్లో నిలిచాడు.

చిన్మయ్ సుతార్ తొలి నాలుగు ఇన్నింగ్స్‌ల స్కోర్లు:

మణిపూర్‌పై: 35 పరుగులు (మొదటి ఇన్నింగ్స్), 99 పరుగులు (రెండో ఇన్నింగ్స్)

నాగాలాండ్‌పై (రెండో మ్యాచ్): 400 పరుగులు

మేఘాలయపై (మూడో మ్యాచ్): 125 పరుగులు

మొత్తం పరుగులు: 659

చరిత్ర సృష్టించిన 400 నాటౌట్ ఇన్నింగ్స్

నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చిన్మయ్ సుతార్ 517 బంతుల్లో 46 ఫోర్లు, 7 సిక్సర్లతో 400 పరుగులతో అజేయంగా నిలిచాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో 400 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా సుతార్ నిలిచాడు. 1948–49 సీజన్‌లో కతియావార్‌పై భావుసాహెబ్ నింబాల్కర్ చేసిన 443 పరుగులే ఇప్పటికీ రంజీలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు.ప్రపంచ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో క్వాడ్రపుల్ సెంచరీ (400+) సాధించిన 10వ బ్యాట్స్‌మన్‌గా సుతార్ అవతరించాడు. బ్రియాన్ లారా, సర్ డాన్ బ్రాడ్‌మన్, విల్ పాన్స్‌ఫోర్డ్ వంటి లెజెండ్స్ ఉన్న క్లబ్‌లో సుతార్ చేరాడు. ఈ ఇన్నింగ్స్‌లో చివరి వికెట్‌కు లాల్‌రెంపుయా చక్‌చువాక్‌తో కలిసి అజేయంగా నెలకొల్పిన 190 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

ముంబై నుంచి మిజోరాం ప్రయాణం.. అవకాశాల వేటలో సంచలనం

ముంబైకి చెందిన చిన్మయ్ సుతార్ స్థానిక క్రికెట్ సర్క్యూట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, జట్టులో తీవ్ర పోటీ కారణంగా రెడ్-బాల్ క్రికెట్‌లో తగినన్ని అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. గతంలో విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడిన సుతార్, మెరుగైన అవకాశాల కోసం 2026–27 దేశవాళీ సీజన్‌కు ముందు మిజోరాం జట్టుకు మారాడు. మిజోరాం బోర్డు అతనిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అరంగేట్రం చేసిన కొద్ది రోజుల్లోనే రికార్డుల రారాజుగా మారాడు

Next Story