Cricket legend Sir Don Bradman: బ్రాడ్‌మన్ టోపీకి రికార్డు ధర
రికార్డు ధర

Cricket legend Sir Don Bradman: క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మాన్ 1947-48లో భారత్‌తో జరిగిన చారిత్రాత్మక సిరీస్‌లో ధరించిన "బాగి గ్రీన్" క్యాప్ వేలంలో రికార్డు ధర పలికింది. సోమవారం గోల్డ్ కోస్ట్‌లో జరిగిన వేలంలో ఒక అజ్ఞాత వ్యక్తి ఈ క్యాప్‌ను 460,000 డాలర్లకు (సుమారు రూ. 3.8 కోట్లు) దక్కించుకున్నారు. బ్రాడ్‌మాన్ ధరించిన క్యాప్‌లలో ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఈ అరుదైన వస్తువును "క్రికెట్ ప్రపంచపు పవిత్ర గ్రంథం" గా వేలం నిర్వాహకులు అభివర్ణించారు.
ఈ క్యాప్ వెనుక ఒక ఆసక్తికరమైన అనుబంధం ఉంది. ఆనాటి సిరీస్ ముగిశాక బ్రాడ్‌మాన్ స్వయంగా ఈ క్యాప్‌ను భారత క్రికెటర్ శ్రీరంగ వాసుదేవ్ సోహోనికి బహుమతిగా ఇచ్చారు. సోహోని కుటుంబం దీనిని మూడు తరాల పాటు అత్యంత భద్రంగా దాచి ఉంచింది. ఆ కుటుంబ సభ్యులకు కూడా ఒక నిబంధన ఉండేది. ఎవరికైనా 16 ఏళ్లు నిండిన తర్వాతే, కేవలం ఐదు నిమిషాల పాటు మాత్రమే ఈ క్యాప్‌ను చూడటానికి అనుమతించేవారు. ఈ క్యాప్ తిరిగి ఆస్ట్రేలియా గడ్డకు చేరుకోవాలన్నదే సోహోని చివరి కోరిక అని సమాచారం.
ఈ చారిత్రాత్మక క్యాప్ లోపల బ్రాడ్‌మాన్, సోహోని పేర్లు రాసి ఉన్నాయి. 75 ఏళ్లు గడిచినా ఇది ఎంతో అద్భుతమైన స్థితిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌మాన్ ధరించిన బాగి గ్రీన్ క్యాప్‌లు కేవలం 11 మాత్రమే అందుబాటులో ఉన్నాయని అంచనా. ఇప్పుడు దీనిని కొనుగోలు చేసిన వ్యక్తి, దీనిని ఆస్ట్రేలియాలోని ఒక మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాలని భావిస్తున్నారు, తద్వారా సామాన్య క్రికెట్ అభిమానులు కూడా ఈ అపురూప జ్ఞాపకాన్ని చూడవచ్చు.

