Dasun Shanaka: శ్రీలంక టీ20 కెప్టెన్ దసున్ షనకపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఒప్పందాన్ని ఉల్లంఘించి మధ్యలోనే ఐపీఎల్‌లో చేరినందుకు గాను, అతడిపై ఏడాది పాటు పీఎస్ఎల్ ఆడకుండా నిషేధం విధించింది. పీఎస్ఎల్ 2026 సీజన్ కోసం లాహోర్ ఖలందర్స్ జట్టు షనకను సుమారు 75 లక్షల పాకిస్థానీ రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే, ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సామ్ కరన్ గాయపడటంతో, అతని స్థానంలో షనకకు అవకాశం వచ్చింది. దీంతో షనక పీఎస్ఎల్ ఒప్పందాన్ని రద్దు చేసుకుని రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో చేరిపోయాడు.

షనక ఏకపక్షంగా టోర్నమెంట్ నుండి తప్పుకోవడం ఒప్పంద నిబంధనలను అతిక్రమించడమేనని పీసీబీ సమీక్షలో తేలింది. బోర్డు క్రమశిక్షణను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. పాకిస్థాన్ గడ్డపై ఆడటం అంటే తనకు ఇష్టమని షనక విచారణలో చెప్పినప్పటికీ, నిబంధనల ఉల్లంఘన తీవ్రంగా ఉండటంతో ఏడాది నిషేధం తప్పలేదు.

మరికొందరిపై కూడా వేటు:

ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ వీడి నిషేధానికి గురైన రెండో అంతర్జాతీయ ఆటగాడు షనక. ఇంతకుముందే జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీపై పీసీబీ రెండేళ్ల నిషేధం విధించింది. అతను ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో చేరాడు. కేకేఆర్ తరపున ఆడుతూ ఒక మ్యాచ్‌లో 4 వికెట్లు కూడా తీశాడు. గతంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కోర్బిన్ బోష్ కూడా ఇలాగే ముంబై ఇండియన్స్ కోసం పీఎస్ఎల్ వీడినందుకు ఏడాది నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. పాకిస్థాన్ బోర్డు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఐపీఎల్ క్రేజ్ ముందు పీఎస్ఎల్ ప్రాభవాన్ని కాపాడుకోవడానికేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story