ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

David Warner: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. మైదానంలో పరుగుల వరద పారించే వార్నర్, ఇప్పుడు రోడ్డుపై నిబంధనలు అతిక్రమించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. సిడ్నీ వీధుల్లో మద్యం తాగి కారు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడటం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది.

మంగళవారం సిడ్నీలోని మారౌబ్రా ప్రాంతంలో స్థానిక పోలీసులు సాధారణ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 39 ఏళ్ల వార్నర్‌ను ఆపి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా, అధికారులు షాక్ అయ్యారు. అనుమతించిన పరిమితి కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో వార్నర్ మద్యం సేవించినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులు వార్నర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ అనంతరం వార్నర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ తర్వాత సొంత పూచీకత్తుపై అతడిని విడుదల చేశారు. అయితే, ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిపోలేదు. వచ్చే నెలలో వార్నర్ ఈ కేసు విషయమై కోర్టుకు స్వయంగా హాజరుకావాల్సి ఉంటుంది. చట్ట ప్రకారం వార్నర్‌పై భారీ జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దయ్యే అవకాశం కూడా ఉంది.

వార్నర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. లీగ్ జరుగుతున్న సమయంలోనే ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం జట్టుకు ఇబ్బందికరమే అయినప్పటికీ, ఈ కేసు వల్ల ఆయన మ్యాచ్‌లు ఆడేందుకు ప్రస్తుతానికి ఎలాంటి సాంకేతిక అడ్డంకులు ఉండబోవని సమాచారం.

Updated On 8 April 2026 9:21 AM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story