Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్లతో జట్టులో ధావన్ పేరు.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమంటూ వార్నింగ్
వార్నింగ్

Shikhar Dhawan: మాజీ టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాలో తన పేరును నిర్వాహకులు చేర్చడంపై మండిపడ్డాడు. తనకు తెలియకుండా, ఎలాంటి అనుమతి తీసుకోకుండా తన పేరును ఉపయోగించారని ఆరోపించిన ధావన్.. నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంగళవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
ఈ టోర్నీలో ఆసియా వారియర్స్ తరఫున ధావన్ ఆడనున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఈ జట్టులో పలువురు పాకిస్థాన్ క్రికెటర్లు కూడా ఉండటంతో ఈ వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే తనకు ఈ టోర్నీతో ఎలాంటి సంబంధం లేదని ధావన్ స్పష్టం చేశాడు. తన పేరుతో వచ్చే అనధికారిక ప్రకటనలను నమ్మొద్దని, వాటిని ప్రచారం చేయొద్దని అభిమానులు, మీడియాను కోరాడు.
ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ధావన్ స్పందిస్తూ.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్‌లో తన పేరును పార్టిసిపెంట్‌గా చూసినట్లు తెలిపాడు. తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా నిర్వాహకులు తన పేరును ఉపయోగించారని, దీనిపై తన టీమ్ తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నాడు. అనధికారిక ప్రకటనల ఆధారంగా వార్తలు ప్రచురించవద్దని మీడియా, అభిమానులను కోరుతూ తనకు ఎప్పటిలాగే ప్రేమ, మద్దతు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు.
ఆసియా వారియర్స్ జట్టులో ధావన్ పేరు ఒక్కటే భారత క్రికెటర్‌ది కాదు. మాజీ టీమిండియా ఆటగాళ్లు రాహుల్ శర్మ, గుర్కీరత్ సింగ్ మాన్, అభిమన్యు మిథున్ పేర్లు కూడా ఆ జట్టు సభ్యుల జాబితాలో ఉన్నాయి.
మరోవైపు 24 మంది సభ్యులతో ఉన్న ఆసియా వారియర్స్ జట్టులో పలువురు పాకిస్థాన్ క్రికెటర్ల పేర్లు కూడా ఉన్నాయి. సొహైల్ తన్వీర్, ఇఫ్తిఖార్ అహ్మద్, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
పాకిస్థాన్ ఆటగాళ్లు ఉన్న జట్టులో ధావన్ పేరు ఉండటంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే 2025లో ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌పై ధావన్ తన వైఖరిని బహిరంగంగానే వెల్లడించాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలోనూ ధావన్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.
‘‘భారత్ ఉగ్రవాదంపై స్టాండ్ తీసుకుంటుంది. భారత్ మాతా కీ జై’’ అంటూ ధావన్ గతంలో ట్వీట్ చేశాడు. మరో ట్వీట్లో పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శిస్తూ.. ‘‘ఘాటియా దేశం మరోసారి తన ఘాటియాపనాన్ని ప్రపంచం ముందు చూపించింది’’ అంటూ పాకిస్థాన్, కాల్పుల విరమణకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఉపయోగించాడు.

