Krishnamachari Srikkanth: ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత తుది జట్టు ఎంపికపై తీవ్ర దుమారం రేగుతోంది. మెరుపు బ్యాటింగ్‌తో అభిమానులను మైదానాలకు రప్పిస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తొలి టీ20లో తుది జట్టు నుంచి తప్పించడంపై భారత మాజీ ఓపెనర్, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జట్టు మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా అన్యాయమని, ఇది చూసి తన భార్య కూడా ఆగ్రహంతో కేకలు వేసిందని ఆయన వెల్లడించారు.

నా భార్య కూడా ఆశ్చర్యపోయింది

శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ టీమ్ మేనేజ్‌మెంట్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. "గత మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాడిని మరుసటి మ్యాచ్‌లోనే బెంచ్‌కే పరిమితం చేస్తారా? టీవీలో మ్యాచ్ చూస్తున్నప్పుడు వైభవ్ లేకపోవడం గమనించి నా భార్య కూడా ఆశ్చర్యంతో అరవడం మొదలుపెట్టింది. ఆ కోపంలో నేను మ్యాచ్ చూడటం మానేసి సినిమా పెట్టుకున్నా. ఇది వైభవ్‌కు జరిగిన ముమ్మాటికీ అన్యాయం. ఒక మ్యాచ్ ఆడించి, ఆ తర్వాత తప్పిస్తే.. మళ్లీ అవకాశం వచ్చినప్పుడు పరుగులు చేయకపోతే జట్టులోంచి తీసేస్తారేమో అన్న అభద్రతాభావం యువ ఆటగాళ్లలో పెరిగిపోతుంది" అని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఓపెనర్లతో ప్రయోగాలు వద్దు..

తొలి టీ20లో వైభవ్‌ను పక్కనపెట్టి సంజూ శాంసన్, అభిషేక్ శర్మలతో టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ మార్పులపై శ్రీకాంత్ కీలక సూచనలు చేశారు.

స్పష్టమైన ప్రణాళిక అవసరం:

ఓపెనింగ్ కాంబినేషన్‌ను మ్యాచ్‌కోసారి మార్చడం సరికాదు. సంజూ శాంసన్‌కు వరుస అవకాశాలిచ్చి నిరూపించుకునే సమయం ఇవ్వాలి, లేదా వైభవ్ సూర్యవంశీకి పూర్తి స్థాయి మద్దతు ఇచ్చి ఆడించాలి.

మార్పులతో గందరగోళం:

ఒక మ్యాచ్‌లో శాంసన్, మరో మ్యాచ్‌లో వైభవ్ అంటూ గందరగోళం సృష్టిస్తే ఇద్దరి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని, ఇలాంటి తప్పులు జట్టుకు మంచిది కాదని హెచ్చరించారు.

రెండో టీ20 ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మేనేజ్‌మెంట్ ఇప్పటికైనా యువ ప్రతిభావంతులకు సరైన అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తుందో లేదో చూడాలి.

Next Story