Pakistan national cricket team Player: క్రికెట్ మైదానంలో పరువు పోయింది.. హోటల్‌లో బుద్ధి గడ్డి తింది: పాక్ క్రికెటర్ బాగోతం!
హోటల్‌లో బుద్ధి గడ్డి తింది: పాక్ క్రికెటర్ బాగోతం!

Pakistan national cricket team Player: శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మరో వివాదం చెలరేగింది. టీ20 వరల్డ్ కప్ సూపర్-8 దశలో వెనుదిరిగిన నిరాశలో ఉన్న ఆ జట్టుకు, ఒక ఆటగాడి ప్రవర్తన ఇప్పుడు కొత్త తలపోటుగా మారింది. క్యాండీలోని ఒక హోటల్‌లో పనిచేస్తున్న మహిళా సిబ్బందితో సదరు క్రికెటర్ అసభ్యంగా ప్రవర్తించాడనే వార్త క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. టెలికామ్ ఆసియా స్పోర్ట్ నివేదిక ప్రకారం, ఈ ఘటన శ్రీలంకతో జరిగిన చివరి సూపర్-8 మ్యాచ్‌కు ముందే జరిగినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. జట్టు బస చేసిన గోల్డెన్ క్రౌన్ హోటల్‌లో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న మహిళతో ఆ క్రికెటర్ తప్పుగా ప్రవర్తించాడని సమాచారం. దీంతో ఆమె వెంటనే కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హోటల్ యాజమాన్యం, ఆ ఆటగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే పాకిస్థాన్ టీమ్ మేనేజర్ నవీద్ చీమా రంగంలోకి దిగి, హోటల్ సిబ్బందికి క్షమాపణలు చెప్పి ఆ ఆటగాడికి జరిమానా విధించడంతో అప్పటికి ఆ వివాదం సద్దుమణిగింది.
ప్రస్తుతానికి ఆ క్రికెటర్ పేరు బయటకు రానప్పటికీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టేలా లేదు. జట్టు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత సదరు ఆటగాడు బోర్డు ముందు హాజరు కావాల్సి ఉంటుందని, అతనిపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చి 1, 2 తేదీల్లో జట్టు సభ్యులందరూ విడతల వారీగా పాకిస్థాన్ చేరుకున్నారు. వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ చేరలేకపోయిన బాధలో ఉన్న అభిమానులకు, ఈ వార్త మరింత ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

