East Bengal FC: 22 ఏళ్ల కలను నిజం చేస్తూ.. చరిత్ర సృష్టించిన ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ
చరిత్ర సృష్టించిన ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ

East Bengal FC: భారత ఫుట్‌బాల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది! సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న అభిమానుల కల నిజమైంది. గురువారం రాత్రి జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ఆఖరి పోరులో ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంటర్ కాశీ జట్టుతో జరిగిన చావో రేవో మ్యాచ్‌లో 2–1 తేడాతో ఘన విజయం సాధించి, తొలిసారి ఐఎస్ఎల్ టైటిల్‌ను ముద్దాడింది!
ఈ గెలుపుతో ఈస్ట్ బెంగాల్ క్లబ్ ఏకంగా 22 ఏళ్ల నాటి తమ ట్రోఫీ కలను నెరవేర్చుకుంది. చివరిసారిగా ఈ క్లబ్ 2003–04 సీజన్ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) టైటిల్ సాధించింది. ఆ తర్వాత జాతీయ లీగ్ టైటిల్ సాధించడం ఇదే మొదటిసారి. మ్యాచ్ విషయానికొస్తే.. ఆట 15వ నిమిషంలోనే ఆల్‌ఫ్రెడ్ గోల్ చేయడంతో ఇంటర్ కాశీ మొదట ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన ఇంటర్ కాశీ ప్లేయర్లు ఆ తర్వాత లయ తప్పారు. ఈస్ట్ బెంగాల్ స్టార్ ప్లేయర్ యూసెఫ్ ఎజ్జెజారి 50వ నిమిషంలో అద్భుత గోల్‌తో స్కోరును సమం చేయగా.. 73వ నిమిషంలో మహ్మద్ రషీద్ చేసిన విన్నింగ్ గోల్‌తో ఈస్ట్ బెంగాల్ విజయం ఖరారైంది.
నిజానికి ఈసారి టోర్నమెంట్‌ను ప్లేఆఫ్స్ లేకుండా.. 13 మ్యాచ్‌ల లీగ్ రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహించారు. పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన జట్టునే విజేతగా ప్రకటిస్తారనడంతో ఆఖరి రౌండ్ మ్యాచ్‌లు నరాలు తెగే ఉత్కంఠను రేపాయి. చివరి మ్యాచ్‌కు ముందు ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ జట్లు చెరో 23 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఆఖరి మ్యాచ్‌లో మోహన్ బగాన్ 2–1తో స్పోర్టింగ్ క్లబ్ ఢిల్లీపై, ముంబై ఎఫ్‌సీ 2–0తో పంజాబ్‌పై గెలిచాయి. దీనితో ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ రెండు జట్లూ 26 పాయింట్లతో సమంగా నిలిచాయి.
కానీ.. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఎదురైంది. టోర్నీ మొత్తంలో గోల్స్ పరంగా మెరుగైన ప్రదర్శన చేసిన ఈస్ట్ బెంగాల్ ప్లస్ 19 (+19) సూపర్ గోల్ డిఫరెన్స్ సాధించగా, మోహన్ బగాన్ ప్లస్ 13 (+13) గోల్ డిఫరెన్స్ మాత్రమే సాధించింది. ఈ రన్ రేట్ (గోల్ డిఫరెన్స్) ఆధారంగా మోహన్ బగాన్‌పై స్పష్టమైన ఆధిపత్యం సాధించి, ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ విశ్వవిజేతగా నిలిచింది.

