ఇంగ్లాండ్‌దే యాషెస్

Ashes Seiries: వచ్చే యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ జట్టు ఘనవిజయం సాధిస్తుందని ఆ దేశ మాజీ క్రికెటర్ ఫిల్ టఫ్నెల్ గట్టిగా విశ్వసిస్తున్నారు. తాజాగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో యువ పేసర్ జోష్ టంగ్ అద్భుత ప్రదర్శన చేయడంతో ఇంగ్లాండ్ శిబిరంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో 'స్టిక్ టు క్రికెట్' అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన టఫ్నెల్, 2028-29 సీజన్‌లో జరగబోయే యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ విజేతగా నిలుస్తుందని, జోష్ టంగ్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా అవతరిస్తాడని జోస్యం చెప్పారు. "నాలుగేళ్ల తర్వాత జరగబోయే యాషెస్ సిరీస్‌ను ఇంగ్లాండ్ గెలుస్తుంది, జోష్ టంగ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవుతాడు. ఇది రాసి పెట్టుకోండి" అంటూ ఆయన తన ధీమాను వ్యక్తం చేశారు.

మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో జోష్ టంగ్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు, రెండో ఇన్నింగ్స్‌లో మరో రెండు వికెట్లు పడగొట్టి మొత్తం ఏడు వికెట్లతో ఆస్ట్రేలియాను దెబ్బకొట్టారు. ఈ అద్భుత స్పెల్ కారణంగా ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో క్లీన్ స్వీప్ ప్రమాదాన్ని తప్పించుకుంది. 1998లో డీన్ హెడ్లీ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ టెస్టులో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన మొదటి ఇంగ్లాండ్ బౌలర్‌గా జోష్ టంగ్ రికార్డు సృష్టించారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై ఇంగ్లాండ్ ఒక టెస్టు గెలిచినప్పటికీ, సిరీస్ మాత్రం కైవసం చేసుకోలేకపోయింది.

టెస్టుల్లో అదరగొట్టిన జోష్ టంగ్, పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ సత్తా చాటుతుండటంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ఈ ఏడాది 'ది హండ్రెడ్' టోర్నీలో మాంచెస్టర్ ఒరిజినల్స్ తరపున కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. ఈ ప్రదర్శనతో, ఇప్పటి వరకు ఇంగ్లాండ్ తరపున ఒక్క పరిమిత ఓవర్ల మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ, 2026 టీ20 వరల్డ్ కప్, శ్రీలంక పర్యటనకు ఆయన ఎంపికయ్యారు. టఫ్నెల్ అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో ఇంగ్లాండ్ జట్టులో జోష్ టంగ్ కీలక పాత్ర పోషించనున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story