First Time in IPL History: ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి: రికార్డులకెక్కిన ప్రియాంశ్ ఆర్య!
రికార్డులకెక్కిన ప్రియాంశ్ ఆర్య!

First Time in IPL History: ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య సరికొత్త రికార్డుతో చరిత్ర సృష్టించాడు. లీగ్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బ్యాటర్‌కూ సాధ్యం కాని రీతిలో అద్భుతమైన ఫీట్ సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను ప్రియాంశ్ ఆర్య ఉప్పెనలా ప్రారంభించాడు. ఢిల్లీ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన మ్యాచ్ తొలి బంతినే పాయింట్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. ఈ సిక్స్‌తో ఐపీఎల్ చరిత్రలో మ్యాచ్ మొదటి బంతికే రెండుసార్లు సిక్స్ కొట్టిన మొట్టమొదటి క్రికెటర్‌గా ప్రియాంశ్ ఆర్య రికార్డు సృష్టించాడు. గతేడాది ముల్లాన్‌పూర్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ వేసిన తొలి బంతికే ప్రియాంశ్ ఇలాగే సిక్స్ బాదాడు.
ఐపీఎల్‌లో మ్యాచ్ మొదటి బంతికే సిక్స్ కొట్టిన రికార్డు విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, నమన్ ఓఝా, ఫిల్ సాల్ట్ లాంటి స్టార్ బ్యాటర్ల పేరిట ఉన్నప్పటికీ.. వారంతా తమ కెరీర్‌లో కేవలం ఒక్కసారి మాత్రమే ఈ ఘనత సాధించారు. కానీ, ప్రియాంశ్ ఆర్య మాత్రం ఏకంగా రెండుసార్లు ఈ ఫీట్ సాధించి వారందరినీ వెనక్కి నెట్టేశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఇన్నింగ్స్ (మొదటి లేదా రెండో ఇన్నింగ్స్) లోని తొలి బంతికి సిక్స్ కొట్టడం ప్రియాంశ్ ఆర్యకు ఇది మూడోసారి. ఈ లిస్టులో యశస్వి జైస్వాల్ (4 సార్లు) మాత్రమే అతనికంటే ముందున్నాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్ చరిత్ర చూసుకుంటే.. మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్స్ కొట్టిన బ్యాటర్లలో ఫిన్ అలెన్, మిచెల్ మార్ష్, కోలిన్ మన్రో వంటి ఎనిమిది మంది దిగ్గజాల సరసన ప్రియాంశ్ చేరాడు. ఇక్కడ కూడా జైస్వాల్ 3 సార్లతో టాప్‌లో ఉన్నాడు.
ధర్మశాల పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అంత సులువుగా ఉండదు. బౌలర్లకు మంచి స్వింగ్, బౌన్స్ లభిస్తున్నప్పటికీ.. ప్రియాంశ్ మాత్రం ఢిల్లీ బౌలర్లను ఉతికేస్తూ కేవలం 24 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 33 బంతులు ఆడిన ప్రియాంశ్ ఆర్య 6 సిక్సర్లు, 2 ఫోర్లతో 56 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో 250కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ ప్రియాంశ్ ఆర్య ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.

