Former all-rounder Irfan Pathan: నెట్ రన్ రేట్ గురించి పక్కన పెట్టి.. ముందు గెలుపుపై దృష్టి పెట్టండి: టీమిండియాకు ఇర్ఫాన్ పఠాన్ సూచన
ముందు గెలుపుపై దృష్టి పెట్టండి: టీమిండియాకు ఇర్ఫాన్ పఠాన్ సూచన

Former all-rounder Irfan Pathan: టీ 20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ ప్రస్తుతం క్లిష్ట స్థితిలో ఉంది. జింబాబ్వేతో జరగనున్న కీలక పోరుకు ముందు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ జట్టుకు కొన్ని కీలక సూచనలు చేశారు. నెట్ రన్ రేట్ (NRR) గురించి అతిగా ఆందోళన చెందకుండా, ముందుగా మ్యాచ్ గెలవడంపైనే ఏకాగ్రత వహించాలని ఆయన కోరారు. ముఖ్యంగా వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా వంటి జట్ల రన్ రేట్‌ను అందుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
జియో స్టార్ నిర్వహించిన 'ఫాలో ది బ్లూస్' కార్యక్రమంలో పఠాన్ మాట్లాడుతూ.. "ఆట ప్రారంభంలోనే నెట్ రన్ రేట్ గురించి ఆలోచించడం సరైన పద్ధతి కాదు. ముందుగా బాగా ఆడి మ్యాచ్ గెలవడానికి ప్రయత్నించండి. జింబాబ్వే, వెస్టిండీస్ వంటి జట్లపై 100 పరుగుల తేడాతో గెలవడం టీ 20ల్లో అంత సులభం కాదు. కాబట్టి అనవసరమైన ఒత్తిడి పెంచుకోకుండా కేవలం విజయం సాధించడంపైనే భారత్ దృష్టి పెట్టాలి" అని స్పష్టం చేశారు.
టాప్ ఆర్డర్‌లో మార్పులు అవసరం:
భారత టాప్ ఆర్డర్‌లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ వంటి లెఫ్ట్ హ్యాండర్లు ఎక్కువగా ఉండటం వల్ల సమతుల్యత దెబ్బతింటుందని పఠాన్ పేర్కొన్నారు. అభిషేక్ శర్మ వరుస డకౌట్లతో ఇబ్బంది పడుతుండగా, తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ కూడా ఆందోళనకరంగా ఉందని గుర్తు చేశారు. ఈ లెఫ్ట్ హ్యాండర్ల ఆధిపత్యాన్ని బ్రేక్ చేయడానికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నంబర్ 3లో బ్యాటింగ్‌కు రావాలని ఆయన సూచించారు.
సూర్య ప్రమోషన్ పై విశ్లేషణ:
సాధారణంగా మిడిల్ ఓవర్లలో విధ్వంసం సృష్టించే సూర్యకుమార్‌ను కొత్త బంతితో రిస్క్ చేయకూడదనే ఉద్దేశంతో టీమ్ మేనేజ్మెంట్ వెనుకకు పంపుతోందని పఠాన్ విశ్లేషించారు. "టాప్ ఆర్డర్ విఫలమవుతున్న సమయంలో సూర్య ఆచి తూచి ఆడుతున్నాడు. అయితే, వరుసగా ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటం బౌలర్లకు అనుకూలంగా మారుతోంది. కాబట్టి ఆ మొనాటనీని పోగొట్టడానికి సూర్య వన్ డౌన్ రావడమే ఉత్తమం" అని పఠాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

