యోగ్‌రాజ్ ఆరోపణలను కొట్టిపారేసిన మాజీ చీఫ్ సెలక్టర్!

Former Chief Selector Sandeep Patil: యువరాజ్ సింగ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసిపోవడానికి ధోనీనే కారణమని యోగ్‌రాజ్ సింగ్ గత కొన్నేళ్లుగా విమర్శిస్తూనే ఉన్నారు. కానీ, మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో అసలు నిజాలను వెల్లడించారు. "నేను రికార్డు పరంగా చెబుతున్నాను.. సెలక్షన్ మీటింగ్స్‌లో గానీ, టూర్లలో గానీ, మ్యాచుల సమయంలో గానీ ఒక్కసారి కూడా ధోనీ 'యువరాజ్ సింగ్‌ను జట్టు నుంచి తీసేయండి' అని చెప్పలేదు. సెలక్షన్ కమిటీ నిర్ణయాల మీద ధోనీకి పూర్తి నమ్మకం ఉండేది. అతను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు" అని పాటిల్ వివరించారు.

తండ్రిగా ఆవేదన ఉండొచ్చు.. కానీ నింద తప్పు!

యోగ్‌రాజ్ సింగ్ చేస్తున్న ఆరోపణలు తప్పు అని, ఒక తండ్రిగా తన కొడుకుపై ఆయనకు ప్రేమ ఉండటం తప్పు కాదని, కానీ నిందను మాత్రం తప్పుడు వ్యక్తిపై వేస్తున్నారని పాటిల్ పేర్కొన్నారు. ధోనీ, యువరాజ్ మధ్య ఎప్పుడూ ఎటువంటి గొడవలు లేవని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా ధోనీ మీడియాకు దూరంగా ఉంటాడు కాబట్టి, ఇలాంటి ఆరోపణలపై అతను ఎప్పుడూ స్పందించలేదని కూడా తెలిపారు.

గౌతమ్ గంభీర్‌తో మాటల్లేవు!

ఇదే ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ గురించి కూడా పాటిల్ ఆసక్తికర విషయాలు చెప్పారు. తన హయాంలో శిఖర్ ధావన్ రాకతో గంభీర్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని, అప్పటి నుంచి గంభీర్ తనతో మాట్లాడటం మానేశాడని వెల్లడించారు. "మేము కొన్ని టీవీ షోలలో కలిసినా అతను కనీసం నా వైపు కూడా చూడడు. నేను 'హలో' చెప్పినా స్పందించడు. అతను జరిగిన దాన్ని మర్చిపోడు, క్షమించడు" అని పాటిల్ అన్నారు. ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ వంటి వారు జట్టు నుంచి తొలగింపును ప్రశాంతంగా స్వీకరించి ముందుకు సాగారని, కానీ గంభీర్ మాత్రం ఇంకా ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నాడని ఆయన అభిప్రాయపడ్డారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story