సురేశ్ రైనాకు ED సమన్లు జారీ

Suresh Raina: బెట్టింగ్ యాప్‌ల కేసులో భాగంగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. 1xBet అనే అక్రమ బెట్టింగ్ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు గాను ఈ విచారణకు హాజరు కావాలని రైనాను ఈడీ కోరింది.ఈ విచారణలో భాగంగా సురేశ్ రైనా పాత్ర, ఈ బెట్టింగ్ యాప్‌తో ఆయనకున్న సంబంధాలు, ప్రచారం కోసం అందుకున్న పారితోషికం వంటి విషయాలపై ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. సురేశ్ రైనా 1xBet వంటి అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ రోజు (ఆగస్టు 13, 2025) ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని రైనాకు సమన్లు పంపారు. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లపై ఈడీ గత కొంతకాలంగా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ యాప్‌లను ప్రచారం చేసిన పలువురు బాలీవుడ్ నటులు, సెలబ్రిటీలను కూడా ఈడీ విచారణకు పిలిచింది. ఈ కేసులో ఇప్పటికే నటుడు రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి వంటి పలువురిపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరు కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ బెట్టింగ్ యాప్‌ల ద్వారా వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచి మోసగించారని, మనీ లాండరింగ్ కార్యకలాపాలు జరిపారని ఈడీ ఆరోపిస్తోంది. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), ఈరోజు (ఆగస్టు 13, 2025) నటి మంచు లక్ష్మిని విచారణకు పిలిచింది. పలు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెకు సమన్లు జారీ చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story