Former Team India player and coach Sanjay Bangar: లింగ మార్పిడి శస్త్రచికిత్సకు సిద్ధమైన మాజీ క్రికెటర్ కుమార్తె
మాజీ క్రికెటర్ కుమార్తె

Former Team India player and coach Sanjay Bangar: టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ తన జీవితంలో మరో కీలక అడుగు వేయబోతున్నారు. గత కొంతకాలంగా తన ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ గురించి సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా చర్చిస్తున్న ఆమె, ఈ ఏడాది మార్చిలో 'లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోనున్నట్లు ప్రకటించారు. ఆర్యన్‌గా జన్మించిన ఆమె, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ద్వారా ఇప్పటికే అనయగా తన గుర్తింపును మార్చుకున్నారు. ఇప్పుడు శస్త్రచికిత్స ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ నిర్ణయానికి తన కుటుంబం నుండి పూర్తి మద్దతు లభించిందని అనయ సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన తండ్రి సంజయ్ బంగర్ ఈ శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చునంతటినీ భరిస్తున్నారని ఆమె తెలిపారు. థాయ్‌లాండ్‌లోని ఒక ప్రముఖ క్లినిక్‌లో ఈ సర్జరీ జరగనుంది. ఈ విషయంలో తనకు ఫ్యాషన్ డిజైనర్ సాయిషా షిండే, నటి త్రినేత్ర హల్దార్ మార్గదర్శకత్వం వహించారని ఆమె పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకోవడానికి సమయం పడుతుందని, దాదాపు ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వస్తుందని ఆమె వివరించారు.
తన గుర్తింపు కోసం గత ఐదేళ్లుగా నిరీక్షిస్తున్నానని, ఇది తన స్వయం ప్రతిపత్తికి సంబంధించిన విషయమని అనయ చెప్పుకొచ్చారు. కేవలం భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదని, అనేక సంవత్సరాల థెరపీ, వైద్య పరీక్షలు, లోతైన ఆత్మపరిశీలన తర్వాతే ఈ అడుగు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒకానొక సమయంలో తన తండ్రి క్రికెట్ భవిష్యత్తు గురించి ఆందోళన చెందినప్పటికీ, ఇప్పుడు తన నిర్ణయాన్ని గౌరవిస్తూ అండగా నిలబడటం ఆమెకు కొండంత బలాన్ని ఇచ్చింది.
భారతదేశం వంటి దేశాల్లో లింగ గుర్తింపు గురించి చర్చించడం ఇంకా కష్టంగానే ఉన్న తరుణంలో, తన తల్లిదండ్రుల మద్దతు ఎంతో విలువైనదని అనయ అభిప్రాయపడ్డారు. తన ప్రయాణం గురించి బహిరంగంగా మాట్లాడటం వల్ల ఇతర ట్రాన్స్ మహిళలకు ధైర్యం లభిస్తుందని, వారి కుటుంబాల్లో ఇలాంటి చర్చలు సులభతరం అవుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్ల పట్ల వివక్ష తొలగి, వారికి సమాన అవకాశాలు కల్పించాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

