Former England Cricketer Isa Guha: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇసా గుహాకు అరుదైన గౌరవం
ఇసా గుహాకు అరుదైన గౌరవం

Former England Cricketer Isa Guha: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ క్రీడా వ్యాఖ్యాత ఇసా గుహాకు అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ రంగంలో ఆమె చేసిన విశేష కృషికి, క్రీడల్లో సమ్మిళితత్వాన్ని (Inclusivity) ప్రోత్సహించినందుకు గాను ప్రతిష్టాత్మక 'Member of the Order of the British Empire' (MBE) అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. బ్రిటన్ రాజు ‘కింగ్స్ న్యూ ఇయర్ ఆనర్స్ - 2026’ జాబితాలో ఆమె పేరును అధికారికంగా ప్రకటించారు. ఏ క్రీడలోనైనా ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించిన దక్షిణ ఆసియా సంతతికి చెందిన మొదటి మహిళగా ఇసా గుహా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
ప్రపంచకప్ విజేతగా అద్భుత ప్రస్థానం: ఇసా గుహా తన కెరీర్‌లో ఇంగ్లాండ్ తరపున 8 టెస్టులు, 83 వన్డేలు, 22 టీ20 మ్యాచ్‌లు ఆడారు. తన మీడియం పేస్ బౌలింగ్‌తో మొత్తం 148 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2009లో ఇంగ్లాండ్ గెలిచిన 50 ఓవర్ల ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ జట్లలో ఆమె సభ్యురాలు. 2005 , 2007-08 యాషెస్ సిరీస్ విజయాల్లోనూ ఆమె తన ముద్ర వేశారు. కేవలం 26 ఏళ్ల వయసులోనే, 2012 మార్చి 9న ఆమె అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. యాదృచ్ఛికంగా అదే రోజున భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం.
వ్యాఖ్యాతగా సెకండ్ ఇన్నింగ్స్.. సేవా రంగంలోనూ ముందు: క్రికెట్ మైదానాన్ని వీడిన తర్వాత, ఇసా గుహా విజయవంతమైన క్రీడా వ్యాఖ్యాతగా (Commentator) మారి సరికొత్త గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో బీబీసీ టెస్ట్ మ్యాచ్ స్పెషల్‌లో మొదటి మహిళా సమ్మరైజర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె, ఆ తర్వాత 2015 ప్రపంచకప్, వింబుల్డన్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌లకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2017లో ప్రొఫెషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ (PCA) బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.
క్రీడలకే పరిమితం కాకుండా, బాలికలు, మహిళల్లో క్రికెట్ పట్ల ఆసక్తిని పెంచేందుకు ‘టేక్ హర్ లీడ్’ (Take Her Lead) అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 1970లలో కోల్‌కతా నుంచి లండన్‌కు వలస వెళ్లిన బరున్, రోమా దంపతులకు 1985లో ఇసా జన్మించారు. ఇప్పటికీ ఆమెకు తన స్వస్థలం కోల్‌కతాతో బలమైన అనుబంధం ఉంది. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, 2018లో ఆమె సంగీత విద్వాంసుడు రిచర్డ్ థామస్‌ను వివాహం చేసుకున్నారు.

