మాజీ రంజీ ప్లేయర్ మృతి!

Former Ranji Player Dies: మిజోరంలో జరుగుతున్న ఒక లోకల్ క్రికెట్ మ్యాచ్‌ సందర్భంగా ఈ దారుణం చోటుచేసుకుంది. 'ఖలీద్ మెమోరియల్ 2వ డివిజన్ స్క్రీనింగ్ టోర్నమెంట్'లో భాగంగా వెంగ్‌నువాయ్ రైడర్స్ సిసి చాన్‌పుయ్ ఐఎల్‌ఎమ్‌ఓవి సిసి మధ్య బుధవారం మ్యాచ్ జరుగుతోంది. వెంగ్‌నువాయ్ రైడర్స్ తరఫున ఆడుతున్న లాల్రెమ్రుత, ఆట కొనసాగుతుండగానే అకస్మాత్తుగా మైదానంలోనే కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన తోటి ఆటగాళ్లు, నిర్వాహకులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను బ్రతికించలేకపోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆయనకు గుండెపోటు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. లాల్రెమ్రుత కేవలం ఆటగాడిగానే కాకుండా, మిజోరం క్రికెట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. మిజోరం తరఫున రంజీ ట్రోఫీలో ప్రాతినిధ్యం వహించి తన ప్రతిభను చాటుకున్నారు. సీనియర్ టోర్నమెంట్ కమిటీ సభ్యుడిగా ఉంటూ, క్షేత్రస్థాయిలో క్రికెట్ అభివృద్ధికి, టోర్నమెంట్ల నిర్వహణకు నిరంతరం శ్రమించేవారు. ఆయన నిస్వార్థ సేవలను తోటి క్రీడాకారులు కొనియాడారు. లాల్రెమ్రుత మృతికి సంతాపంగా 'క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం' (CAM) గురువారం జరగాల్సిన అన్ని అధికారిక మ్యాచులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 2వ డివిజన్ మ్యాచులతో పాటు, ఇంటర్-స్కూల్ టోర్నమెంట్ మ్యాచులు కూడా ఉన్నాయి. రద్దయిన ఈ మ్యాచుల షెడ్యూల్‌ను త్వరలోనే సవరిస్తామని అసోసియేషన్ తెలిపింది. లాల్రెమ్రుత మృతి పట్ల మిజోరం క్రికెట్ అసోసియేషన్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. "ఆయన మరణం మిజోరం క్రికెట్‌కు తీరని లోటు. నిస్వార్థంగా క్రీడల కోసం పనిచేసిన ఒక మంచి వ్యక్తిని మేము కోల్పోయాము" అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించింది. క్రీడా మైదానంలో ఇలాంటి ఘటనలు జరగడం క్రీడాకారుల ఆరోగ్యం, భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story