టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంఎస్ ధోనీ వస్తారా?

Gautam Gambhir Makes Interesting Remarks: భారత క్రికెట్ చరిత్రలో ఇద్దరు దిగ్గజాలుగా పేరుగాంచిన గౌతమ్ గంభీర్, మహేంద్ర సింగ్ ధోనీల మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. గతేడాది టీమిండియా 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంలో గంభీర్ నవ్వుతున్న ఫోటోపై ధోనీ స్పందిస్తూ.. "గంభీర్ ముఖంలో ఆ నవ్వు చాలా బాగుంది" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో దీనిపై గంభీర్ ఎంతో ఉద్వేగంగా స్పందించారు. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ధోనీ తన స్థానంలో అంటే టీమిండియా హెడ్ కోచ్‌గా ఉండాలని, ఆ సమయంలో డగౌట్‌లో కూర్చున్న ధోనీని చూసి తను అదే మెసేజ్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు గంభీర్ తన మనసులోని మాటను బయటపెట్టారు.

ఒకప్పుడు ధోనీ క్రేజ్ మీద గంభీర్ విమర్శలు చేస్తారనే ప్రచారం జోరుగా సాగేది. కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య కనిపిస్తున్న ఈ అన్యోన్యత చూసి క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా వరల్డ్ కప్ ఫైనల్ చూడటానికి ధోనీ రావడం, గంభీర్‌ను నవ్వమని చెప్పడం వంటివి చూస్తుంటే వారి మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదో అర్థమవుతోంది. కోచ్‌గా తన బాధ్యతలను ధోనీకి అప్పగించాలని గంభీర్ కోరుకోవడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గంభీర్ ప్రస్తుతం టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించి తిరుగులేని కోచ్‌గా కొనసాగుతున్నారు. టెస్ట్ క్రికెట్‌లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆయనే కోచ్‌గా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మరోవైపు ఎంఎస్ ధోనీకి కోచింగ్‌లో పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ, 2021 టీ20 వరల్డ్ కప్ సమయంలో జట్టుకు మెంటార్‌గా వ్యవహరించారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న ధోనీ, రిటైర్మెంట్ తర్వాత అదే జట్టుకు మెంటార్‌గా మారతారని అందరూ భావిస్తున్నారు. అయితే గంభీర్ కోరిక నెరవేరి ధోనీ నిజంగానే టీమిండియా కోచ్ బాధ్యతలు చేపడితే చూడాలని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో ధోనీ సేన తమ ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. అటు గంభీర్ కోచింగ్, ఇటు ధోనీ ఆట.. వెరసి భారత క్రికెట్‌లో ఒక కొత్త శకం కొనసాగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story