Gautam Gambhir : గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం
గంభీర్ సంచలన నిర్ణయం

Gautam Gambhir : టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఒక కఠినమైన నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2026 టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను తొలగించడం ద్వారా గంభీర్ స్టార్ ఆటగాళ్లకు బలమైన సందేశాన్ని పంపారని మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ మోంటీ పనేసర్ కొనియాడారు. ఫామ్‌లో లేకపోతే ఎంతటి పెద్ద ఆటగాడినైనా పక్కన పెట్టడానికి గంభీర్ వెనుకాడరని పనేసర్ అభిప్రాయపడ్డారు.
స్టార్ హోదా ఉన్నా తప్పని వేటు సెప్టెంబర్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు డిప్యూటీగా, జట్టులో మొదటి ఛాయిస్ ఓపెనర్‌గా గిల్‌ను ఎంపిక చేశారు. టెస్ట్, వన్డే జట్లకు నాయకత్వం వహిస్తూ, ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఉండి, భవిష్యత్తులో మూడు ఫార్మాట్లకు కెప్టెన్ అవుతాడనుకున్న గిల్‌ను జట్టు నుంచి తొలగించడం భారత క్రికెట్‌లో అరుదైన విషయం. అయితే, గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, కొన్ని మ్యాచ్‌లలో వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో గిల్‌పై గంభీర్ వేటు వేశారు.
పెద్ద ఆటగాళ్లకు హెచ్చరిక ఈ నిర్ణయంపై పనేసర్ స్పందిస్తూ.. "ఎంత పెద్ద ఆటగాడైనా సరే, ఫామ్ సరిగ్గా లేకపోతే నేను డ్రాప్ చేయడానికి భయపడను అని గంభీర్ నిరూపించారు. ఇది జట్టులోని మిగిలిన స్టార్లకు ఒక హెచ్చరిక లాంటిది. తర్వాతి వంతు తమదే అవుతుందేమోనని వారు భయపడాలి. అవసరమైతే గంభీర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కూడా తొలగించగలరు. జట్టు ప్రయోజనాల కోసం గంభీర్ సరైన నిర్ణయం తీసుకుంటారని నేను ముందే చెప్పాను" అని పేర్కొన్నారు.
సూర్యకుమార్‌కు అగ్నిపరీక్ష వరల్డ్ కప్ జట్టును ఇప్పటికే ఎంపిక చేసినప్పటికీ, ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు జనవరిలో న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్ అత్యంత కీలకం కానుంది. ఒకవేళ ఆ సిరీస్‌లో సూర్య రాణించలేకపోతే, గంభీర్ మార్క్ నిర్ణయాలు అతనిపై కూడా ఉంటాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గంభీర్ నాయకత్వంలో జట్టులో స్థానం దక్కాలంటే కేవలం పేరు ఉంటే సరిపోదని, ప్రదర్శన కూడా ఉండాలని పనేసర్ నొక్కి చెప్పారు.

