Gavaskar: క్రికెట్ డిక్షనరీలో ఆ పదం ఉండొద్దు :గవాస్కర్
ఆ పదం ఉండొద్దు

Gavaskar: క్రికెట్‌లో పనిభారం (workload) పై సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లు శారీరకంగా కంటే మానసికంగా దృఢంగా ఉండటం ముఖ్యమని అన్నారు. పనిభారం అనేది ఒక మానసిక అంశం తప్ప అది పెద్ద శారీరక సమస్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశం కోసం సరిహద్దుల్లో పనిచేసే సైనికులకు చలి, ఇతర ఇబ్బందులు ఉన్నా ఫిర్యాదు చేయరని, అదే విధంగా దేశానికి ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు కూడా తమ శరీరంపై చిన్నచిన్న నొప్పులను పట్టించుకోకూడదని గవాస్కర్ అన్నారు. మహ్మద్ సిరాజ్ ఐదు టెస్టుల సిరీస్ మొత్తంలో బౌలింగ్ చేసి, కెప్టెన్ అవసరానికి అనుగుణంగా సుదీర్ఘ స్పెల్స్ వేశాడని, ఇది పనిభారం అనే భావనను తొలగించిందని ఆయన ప్రశంసించారు.
గతంలో గాయపడినప్పుడు కూడా కాలికి ఫ్రాక్చర్ ఉన్నప్పటికీ బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్ పంత్ స్ఫూర్తిని కూడా గవాస్కర్ గుర్తు చేశారు. పనిభారం గురించి ఆలోచిస్తే దేశం కోసం ఉత్తమ ఆటగాళ్లను మైదానంలోకి దించలేమని, ఇది జట్టుకు నష్టం కలిగిస్తుందని గవాస్కర్ స్పష్టం చేశారు. అందుకే భారత క్రికెట్ డిక్షనరీ నుంచి పనిభారం అనే పదాన్ని తొలగించాలని తాను చాలా కాలంగా చెబుతున్నానని ఆయన తెలిపారు.
