Harbhajan Singh: భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మరువలేని వివాదాలలో హర్భజన్ సింగ్ - ఎస్. శ్రీశాంత్ 'చెంపదెబ్బ' (Slapgate) ఉదంతం ఒకటి. 2008 ఐపీఎల్ తొలి సీజన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య తరచూ ఏదో ఒక రూపంలో చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా ఈ వివాదంపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా మీకు ఇష్టమైన క్రికెటర్‌తో రూమ్‌ను పంచుకునే అవకాశం వస్తే ఎవరిని ఎంచుకుంటారని హర్భజన్‌ను ప్రశ్నించారు. దీనికి భజ్జీ ఏమాత్రం తడబడకుండా మాజీ పేసర్ శ్రీశాంత్ పేరును వెల్లడించారు. 'మాకు అవకాశం వచ్చి.. మేమిద్దరం ఒకే రూమ్‌లో ఉంటే మాత్రం, గతంలో మా మధ్య ఎదురైన సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగలం. ఆ నమ్మకం నాకుంది. నేను ఇదే కోణంలో చూస్తా. నా రూమ్‌మేట్‌గా అతడినే ఎంపిక చేసుకుంటా. నాకు ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు' అంటూ హర్భజన్ బదులిచ్చారు. ఇటీవల శ్రీశాంత్ తనను బాక్సింగ్ రింగ్‌లోకి రావాలని బహిరంగంగా సవాల్ విసిరిన నేపథ్యంలో, భజ్జీ ఈ విధంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లో భారత్ తరఫున కలిసి ఆడిన ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఆ తర్వాత మనస్పర్థలు వచ్చాయి. అయితే కాలక్రమేణా పరిస్థితులు సర్దుమణిగానప్పటికీ, అప్పుడప్పుడు వీరి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తాజాగా హర్భజన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇద్దరి మధ్య ఉన్న పాత జ్ఞాపకాలను, వివాదాలను మరోసారి తెరపైకి తెచ్చాయి. మరి భజ్జీ వ్యాఖ్యలపై శ్రీశాంత్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story