Harmanpreet Kaur: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన 'పద్మశ్రీ' అవార్డును ఆమె సోమవారం అందుకుంది. ఈ ఏడాది పద్మ పురస్కారాలు దక్కించుకున్న ఇద్దరే ఇద్దరు క్రికెటర్లలో హర్మన్‌ప్రీత్ ఒకరు కాగా, మరొకరు పురుషుల జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ. గతేడాది నవంబర్‌లో సొంతగడ్డపై భారత మహిళల జట్టు ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన హర్మన్‌ప్రీత్ అద్భుత ప్రతిభకు, భారత క్రికెట్‌కు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందించింది.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా హర్మన్‌ప్రీత్ ఈ అవార్డును స్వీకరించింది. ఈ వేడుకకు ఆమె సాంప్రదాయబద్ధమైన క్రీమ్ కలర్ దుస్తులలో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఏడాది మొత్తం 131 పద్మ అవార్డులను ప్రభుత్వం ప్రకటించగా, మొదటి విడతలో భాగంగా ఇద్దరికి పద్మవిభూషణ్, ఆరుగురికి పద్మభూషణ్, 58 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి అందజేశారు. మిగిలిన విజేతలను రెండో విడతలో సత్కరించనున్నారు. కాగా, ఈ జాబితాలో ఉన్న రోహిత్ శర్మ కొన్ని కారణాల వల్ల ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు.

క్రీడా రంగానికి సంబంధించి హర్మన్‌ప్రీత్‌తో పాటు భారత ఒలింపిక్ రెజ్లర్ల మెంటార్, దివంగత వ్లాదిమిర్ మెస్ట్విరిష్విలికి మరణానంతరం పద్మశ్రీ లభించింది. అలాగే 2022 కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత, హాకీ ప్లేయర్ సవితా పునియా కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకుంది.

ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ అవార్డు వేడుక కోసం ఇండియాలోనే ఉండగా, ఆమె సహచర ఆటగాళ్లు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్ తదితరులు అప్పుడే ఇంగ్లాండ్‌లోని చెమ్స్‌ఫర్డ్‌కు చేరుకున్నారు. జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న మహిళల టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా అక్కడ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. జూన్ 14న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌తో భారత్ తన ప్రపంచకప్ వేటను ప్రారంభించనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story