తవ్వేకొద్దీ వెలుగు చూస్తున్న హెచ్‌సీఏ అక్రమాలు
హెచ్‌సీఏ గుర్తుంపు రద్దు చేయాలని టీసీఏ ప్రధాన కార్యదర్శి గురవారెడ్డి డిమాండ్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో తవ్విన కొద్దీ అక్రమాలు బయట పడుతున్నాయని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ధారమ్ గురవారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం గురవారెడ్డి మీడియాతో మాట్లాడుతై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు రద్దు చేయాలని బీసీసీఐని డిమాండ్ చేశారు. హెచ్‌సీఏలో కేవలం ఆర్ధిక లావాదేవీల్లోనే కాకుండా ఇతర వ్యవహారాల్లో కూడా అక్రమాలు చేశారని గురవారెడ్డి వెల్లడించారు. హెచ్‌సీఏపై ఇన్ని రకాల ఆరోపణలు వస్తున్నా గుర్తుంపు రద్దు చెయ్యకుండా కోర్టులో కేసులు వేస్తూ కాలయాపన చేస్తున్నారని గురవారెడ్డి మండిపడ్డారు. ఈ అక్రమాలన్నింటికీ కేటీఆర్, కవితలే కారణమని, కేసీఆర్ క్విక్ ప్రొసీజర్ కోడ్‌కు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. హెచ్‌సీఏ అక్రమాలు నేను ఒక్కటొక్కటీ బయటపెడుతుంటే కేటీఆర్ బావమరిది రాజు పాకాల నాకు లీగల్ నోటీసు పంపారని దానికి నేను రిప్లై ఇస్తుంటే ఫెయిల్ అయ్యిందని అందుకే మీడియా ముఖంగా సమాధానం ఇస్తున్నానని గురవారెడ్డి పేర్కొన్నారు. 2017 నుంచి ఈవెంట్స్ నౌ డాట్ కాం ద్వారా టిక్కెట్ల అమ్మకాలు జరిపినట్లు ఆడిట్ రిపోర్టులు ఉన్నాయని, ఆడిట్ రిపోర్టుల్లో వ్యయ చెల్లింపులు ప్రతి ఏటా ఒకే విధంగా ఉన్నాయని గురవారెడ్డి తెలిపారు. ఇందులో అధికారుల తప్పిదం ఉందా లేక ఆడిటర్ల తప్పిదం ఉందో తేలాలన్నారు. అయితే తనకు 2019లో మాత్రమే సంబంధం ఉందని రాజు పాకాల చెపుతున్నారని గురవారెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని మోసం చేయడం కోసమే దొంగ దారిలో జగన్మోహన్‌రావుని అధ్యక్షుడ్ని చేశారని గురవారెడ్డి ఆరోపించారు. పదేళ్ళగా క్లబ్బులకు ప్రతి ఏటా రూ.6.10 కోట్లు ఇస్తున్నారని ఈ మొత్తం చెల్లింపులు పదేళ్ళుగా ఒకే రకంగా ఎందుకు ఉన్నాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కో ఆపరేటివ్ క్లబ్బులకు ఎందుకు నిధులు చెల్లిస్తున్నారని గురవారెడ్డి ప్రశ్నించారు. నల్గొండ క్రికెట్ అసోసియేషన్ అసలు మెంబరే కాదని కానీ పదేళ్ళ నుంచి ఆ అసోసియేషన్‌కి కూడా డబ్బులు చెల్లిస్తున్నారని గురవారెడ్డి చెప్పారు.
