Heinrich Klaasen: హెన్రిచ్ క్లాసెన్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలి
రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలి

Heinrich Klaasen: సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా.. ఐపీఎల్ 2026లో మాత్రం క్లాసెన్ ఆడుతున్న తీరు చూస్తుంటే ప్రపంచ క్రికెట్ నివ్వెరపోతోంది.
ప్రస్తుత సీజన్‌లో 34 ఏళ్ల క్లాసెన్ ఆగుతున్న దాఖలాలే కనిపించడం లేదు. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనే ఏకంగా 414 పరుగులు సాధించి, టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా 157 పైచిలుకు స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్లను వణికిస్తున్నాడు. బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లోనే 65 పరుగులతో అజేయంగా నిలిచి, ఆరెంజ్ ఆర్మీకి మరో అద్భుత విజయాన్ని అందించాడు.
క్లాసెన్ ఫామ్ చూసి ముగ్ధుడైన ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం కెవిన్ పీటర్సన్, సోషల్ మీడియా వేదికగా సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఒక ఆసక్తికర విజ్ఞప్తి చేశాడు. క్లాసెన్ లాంటి ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండటం క్రికెట్ ప్రపంచానికే లోటని అభిప్రాయపడ్డాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా క్లాసెన్‌ను ఒప్పించాలని సౌతాఫ్రికా బోర్డును కోరాడు.
క్లాసెన్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని.. ఇలాంటి సమయంలో అతడు దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో ఉంటే, రాబోయే ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టుకు తిరుగుండదని పీటర్సన్ విశ్లేషించాడు. కేవలం ఫ్రాంచైజీ క్రికెట్‌కే పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటాలని పీటర్సన్ ఆకాంక్షించాడు.రిటైర్మెంట్ తర్వాత కూడా ఇంతటి నిలకడ ప్రదర్శించడం క్లాసెన్‌కు మాత్రమే సాధ్యమని అభిమానులు కొనియాడుతున్నారు.

