India and Japan: భారత్–జపాన్ మధ్య చారిత్రాత్మక క్రికెట్ మ్యాచ్.. సెప్టెంబర్ 22న పోరు!
సెప్టెంబర్ 22న పోరు!

India and Japan: భారత్, జపాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చారిత్రాత్మక క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఇరు దేశాల పురుషుల క్రికెట్ జట్లు 2026 సెప్టెంబర్ 22న జపాన్‌లో టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి.
ఈ ఒక్క మ్యాచ్‌ను ‘సుజుకి కప్’ పేరుతో నిర్వహించనున్నారు. జపాన్‌లోని తొచిగి ప్రిఫెక్చర్‌లో ఉన్న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరగనుంది. భారత్–జపాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవ వేడుకలకు ఈ మ్యాచ్‌తో శ్రీకారం చుట్టనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
ఈ మ్యాచ్‌తో పాటు ‘స్పోర్ట్ 75’ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. క్రీడల ద్వారా భారత్, జపాన్ ప్రజల మధ్య సంబంధాలు, పరస్పర సహకారాన్ని పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఇరు దేశాల ప్రధానుల మధ్య జరిగిన సమావేశంలో కుదిరిన ఒప్పందం ఆధారంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 2036 ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించాలన్న భారత లక్ష్యాన్ని కూడా ఇది దృష్టిలో పెట్టుకుంది.
ఈ మ్యాచ్ జపాన్ క్రికెట్‌కు కూడా ఎంతో ప్రత్యేకం కానుంది. ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న భారత జట్టు తొలిసారి జపాన్‌లో మ్యాచ్ ఆడబోతోంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది.
బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ఇది క్రికెట్‌కు ఎంతో ముఖ్యమైన సందర్భమని అన్నారు. భారత జట్టును కొత్త ప్రాంతానికి తీసుకెళ్లడంతో పాటు జపాన్, తూర్పు ఆసియా దేశాల్లో మరింత మంది ప్రేక్షకులకు క్రికెట్‌ను పరిచయం చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు.
క్రికెట్ సంప్రదాయంగా బలంగా ఉన్న దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ క్రీడ అభివృద్ధి చెందాలని బీసీసీఐ కోరుకుంటోందని సైకియా తెలిపారు. ఈ విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బోర్డుగా తమ బాధ్యతను నిర్వర్తిస్తామని చెప్పారు. జపాన్‌లో క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు జపాన్ క్రికెట్ అసోసియేషన్‌తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.
జపాన్ క్రికెట్ అసోసియేషన్ సీఈఓ నావోకి మియాజీ కూడా ఈ మ్యాచ్‌పై ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ ఛాంపియన్ భారత జట్టును జపాన్‌కు ఆహ్వానించడం తమకు ఎంతో గొప్ప విషయమని అన్నారు. మ్యాచ్‌కు భారత క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో రావాలని, క్రికెట్‌పై ఆసక్తి ఉన్న జపాన్ స్థానికులు కూడా స్టేడియానికి వచ్చి తమ జట్టును ప్రోత్సహించాలని ఆయన కోరారు.
మొత్తానికి భారత్–జపాన్ దౌత్య సంబంధాల 75 ఏళ్ల వేడుకలకు ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అదే సమయంలో జపాన్‌లో క్రికెట్‌కు మరింత ఆదరణ తీసుకురావడానికి ఇది కీలక అడుగుగా మారే అవకాశం ఉంది.

