Hyderabad Champions: తెలంగాణ టీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజయ విహారం చేస్తోంది! వరుస విజయాలతో దూసుకుపోతూ.. లీగ్‌లో తన ముద్రను గట్టిగా వేస్తోంది. గురువారం హోరాహోరీ పోరులో రంగారెడ్డి రైజర్స్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టోర్నమెంట్‌లో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది హైదరాబాద్ ఈ ఛాంపియన్స్.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన రంగారెడ్డి రైజర్స్ బ్యాటర్లు క్రీజులో అద్భుతంగా రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 195 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచారు. హైదరాబాద్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ రంగారెడ్డి జట్టు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

అయితే, 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌కు ఏమాత్రం బెరుకు లేకుండా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ముఖ్యంగా కెప్టెన్ అభిరథ్ రెడ్డి మైదానంలో పూనకం వచ్చినట్లు శివతాండవం చేశాడు. రంగారెడ్డి బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో చెడుగుడు ఆడుకున్నాడు. కేవలం 45 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి.. కేవలం ఒకే ఒక్క పరుగుతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కానీ, అతడి సూపర్ ఇన్నింగ్స్ హైదరాబాద్ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించింది.

కెప్టెన్ అభిరథ్ రెడ్డికి తోడు.. మిగతా బ్యాటర్లు కూడా రాణించారు. షణ్ముఖ 18 బంతుల్లో 3 సిక్సర్లతో 30 పరుగులు చేయగా, గడుగు గణేశ్ 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక చివర్లో యశ్వీర్ గౌడ్ కేవలం 13 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 30 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరి అద్భుత బ్యాటింగ్ జోరుతో హైదరాబాద్ జట్టు ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే.. అంటే 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఊదేశింది.

రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య, తనయ్, ఆర్యన్, అరుణ్ తలో వికెట్ తీసినప్పటికీ.. హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసాన్ని వారు అడ్డుకోలేకపోయారు. ఇక ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హైదరాబాద్ కెప్టెన్ అభిరథ్ రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా, చివర్లో మెరుపులు మెరిపించిన యశ్వీర్ గౌడ్‌కు ‘గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.ఈ అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అగ్రస్థానానికి చేరుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story