TG20 League: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సరికొత్త ‘టీజీ20’ లీగ్ మొదటి సీజన్ టైటిల్ సమరం ముగిసింది! ఉత్కంఠభరితంగా సాగిన గ్రాండ్ ఫైనల్ పోరులో అన్విత ఖమ్మం ఏసెస్ జట్టుపై హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ ఘన విజయం సాధించింది. మెగా ట్రోఫీతో పాటు రూ. 1 కోటి భారీ ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది.

టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం ఏసెస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఖమ్మం స్టార్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ 39 బంతుల్లో 65 పరుగులు చేసి అదరగొట్టాడు. హిమతేజ 31 పరుగులతో రాణించాడు. ఒక దశలో ఖమ్మం భారీ స్కోరు చేసేలా కనిపించినా.. హైదరాబాద్ బౌలర్ యశ్వీర్ గౌడ్ కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి కట్టడి చేశాడు. దేవ్ మెహతా, అజయ్ దేవ్ గౌడ్ చెరో రెండు వికెట్లతో రాణించారు.

ఆ తర్వాత 158 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ బ్యాటర్లు పట్టుదలగా ఆడారు. ఓపెనర్ అభిరథ్ రెడ్డి 48 పరుగులతో మంచి ఆరంభాన్ని ఇవ్వగా.. వైష్ణవ రెడ్డి 41, షణ్ముఖ అశ్విన్ 36 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఖమ్మం ఫీల్డర్లు కీలకమైన మూడు క్యాచ్‌లు జారవిడవడం ఆ జట్టును భారీగా దెబ్బతీసింది. దీంతో హైదరాబాద్ బ్యాటర్లు కేవలం 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచారు.

విన్నర్ హైదరాబాద్ జట్టుకు రూ. 1 కోటి నగదు బహుమతితో పాటు మెగా ట్రోఫీని అందజేశారు. రన్నరప్ ఖమ్మం జట్టుకు రూ. 50 లక్షలు దక్కగా.. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన కరీంనగర్, రంగారెడ్డి జట్లకు చెరో రూ. 25 లక్షలు లభించాయి

PolitEnt Media

PolitEnt Media

Next Story