PV Sindhu: ఎవరి కోసమో నా సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.. పీవీ సింధు కీలక కామెంట్స్
పీవీ సింధు కీలక కామెంట్స్

PV Sindhu: ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు తనదైన శైలిలో అదరగొడుతోంది. ఇటీవల వరల్డ్ నంబర్ 2 ప్లేయర్ వాంగ్ యూను ఓడించి సంచలనం సృష్టించింది. 2019లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సింధు, గాయాలు ఎదురైనప్పటికీ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుని ఈసారి టోర్నీలో ప్రవేశించింది. రెండో ర్యాంకర్‌పై విజయం సాధించిన తర్వాత ఆమె తన పోరాటం గురించి మాట్లాడారు.
నా సత్తా ఏంటో ఇప్పటికే నిరూపించా:
‘‘నేను నిరూపించుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. నా సత్తా ఏంటో ఇప్పటికే వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో నిరూపించాను. ప్రత్యేకంగా ఎవరి కోసమో ఆడాల్సిన అవసరం లేదు. విజేతగా నిలవడంపైనే దృష్టి పెట్టాను’’ అని సింధు అన్నారు. గత రెండేళ్లుగా తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, గాయాలు కూడా ఇబ్బందిగా మారాయని ఆమె తెలిపారు. ‘‘గెలవాలని తీవ్రంగా ప్రయత్నించినా కొన్నిసార్లు సాధ్యపడలేదు. కానీ, ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించి మళ్ళీ నూతన ఉత్సాహంతో అడుగు పెట్టా. కేవలం ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసమే చాలా కష్టపడ్డాను. ప్రతి టోర్నీ ముగిసిన తర్వాత, నేను చేసిన పొరపాట్లు ఏంటో కోచ్‌తో కలిసి చర్చిస్తుంటాను. మరోసారి ఆ తప్పిదం చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఈ టోర్నీలో దాని ఫలితం కనిపిస్తోంది’’ అని సింధు వెల్లడించారు.
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్:
క్వార్టర్ ఫైనల్‌లో పీవీ సింధు ఇండోనేషియాకు చెందిన తొమ్మిదో ర్యాంకర్ పీకే వార్దానితో తలపడనుంది. ప్రస్తుతం సింధు 15వ ర్యాంకులో ఉంది. నాకౌట్ దశలో ఆమె టాప్ ర్యాంకర్లతో పోటీ పడాల్సి ఉంటుంది. క్రీడా విశ్లేషకుల అంచనా ప్రకారం, ప్రపంచ రెండో ర్యాంకర్‌పైనే గెలిచిన సింధు, మిగతా ప్లేయర్లపై ఆధిపత్యం ప్రదర్శించడం పెద్ద కష్టమేమీ కాదు. సెమీస్‌లో కూడా ఆమెకు కఠినమైన ప్రత్యర్థి ఎదురుకావచ్చని అంచనా.
