Brett Lee: నాతో ఆ బాలీవుడ్ హీరోయిన్ డేటింగ్ చేయలేదు.. ప్రీతి జింటా వ్యవహారంపై బ్రెట్ లీ ఓపెన్ కామెంట్స్..
బ్రెట్ లీ ఓపెన్ కామెంట్స్..

Brett Lee: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ, బాలీవుడ్ సొగసరి ప్రీతి జింటాల మధ్య గతంలో ప్రేమాయణం సాగిందంటూ వచ్చిన వార్తలకు ఎట్టకేలకు చెక్ పడింది. చాలా ఏళ్లుగా సాగుతున్న ఈ ప్రచారానికి బ్రెట్ లీ స్వయంగా తెరదించాడు. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని, ఎలాంటి డేటింగ్ లేదని ఆయన స్పష్టం చేశాడు.
ఆ పుకార్లకు కారణమిదే
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రీతి జింటా యజమానిగా వ్యవహరిస్తుండగా, 2008 నుండి 2011 మధ్య ఆ జట్టు తరఫున బ్రెట్ లీ ప్రాతినిధ్యం వహించాడు. ఆ సమయంలో వీరిద్దరూ కలసి పలు మ్యాచ్‌లు, ఈవెంట్లలో సందడి చేయడం, ముంబైలోని ఒక రెస్టారెంట్ వద్ద కనిపించడంతో వీరు ప్రేమలో ఉన్నారంటూ అప్పట్లో విపరీతంగా ప్రచారం జరిగింది.
నాకేం సంబంధం లేదు - బ్రెట్ లీ
తాజాగా బాంబే టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెట్ లీ మాట్లాడుతూ "నేను ఏ బాలీవుడ్ నటితోనూ డేటింగ్ చేయలేదు. ప్రీతి నాకు ఇప్పటికీ మంచి స్నేహితురాలు. ఆమె చాలా తెలివైన మహిళ, ఆమెపై నాకు ఎంతో గౌరవం ఉంది. నిజమేంటో నాకు తెలుసు కాబట్టి ఇటువంటి రూమర్లు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు" అని వ్యాఖ్యానించాడు. నిజానికి 2010లోనే ప్రీతి జింటా కూడా ఈ వార్తలను ఖండిస్తూ, తామిద్దరం మంచి మిత్రులమని క్లారిటీ ఇచ్చింది.
వ్యక్తిగత జీవితాలు - సినిమా విశేషాలు
వ్యక్తిగత జీవిత విషయానికొస్తే.. బ్రెట్ లీ 2014లో లానా ఆండర్సన్‌ను వివాహం చేసుకోగా.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు ప్రీతి జింటా 2016లో అమెరికా వ్యాపారవేత్త జీన్ గుడ్‌ఇనఫ్‌ను పెళ్లి చేసుకుని, సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సినిమాల్లో మళ్లీ బిజీ అయిన ప్రీతి జింటా నటిస్తున్న పీరియాడికల్ మూవీ బట్వారా 1947 ఈ నెల (ఆగస్టు) 14న విడుదల కానుంది.

