Sara Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటారు. సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్టులు, గ్లామరస్ ఫొటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే, తాజాగా ఓ ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, రిలేషన్‌షిప్‌లపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

పెళ్లి అనేది నూరేళ్ల బంధం.. అది కేవలం ఒక ఒప్పందం కాదని, ముందుగా అది మంచి స్నేహంతో మొదలు కావాలని సారా అభిప్రాయపడ్డారు. తన తల్లిదండ్రులు సచిన్, అంజలిల బంధాన్నే తన జీవితంలో తాను ఒక పర్ఫెక్ట్ టెంప్లేట్‌గా చూస్తానని ఆమె తెలిపారు. భార్యాభర్తలుగా ఉండటానికి ముందే వారిద్దరూ మంచి స్నేహితులని, ఇంట్లో వారి మధ్య జరిగే సరదా సంభాషణలు, ఫ్రెండ్లీ సెటైర్లు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని సారా చెప్పారు. తమ మధ్య ఎలాంటి పవర్ డైనమిక్స్ (ఆధిపత్య ధోరణులు) ఉండవని, అదే బంధాన్ని తాను కోరుకుంటున్నానని ఆమె స్పష్టం చేశారు.

తమ్ముడు అర్జున్ టెండూల్కర్ వివాహం తర్వాత పెళ్లిపై తన ఆలోచనలు మరింత స్పష్టంగా మారాయని సారా అన్నారు. పెద్దల ఒత్తిడితో లేదా సమాజం కోసం తొందరపడి పెళ్లి చేసుకునే వయసు ఇది కాదన్న ఆమె.. ఒకవేళ పెళ్లికి ముందే కాబోయే భాగస్వామి ప్రవర్తనలో తేడాలు గుర్తించినా, బంధం సరైన మార్గంలో లేదనిపించినా వెనక్కి తగ్గడంలో ఎలాంటి తప్పులేదని కుండబద్దలు కొట్టారు.

గత తరాలతో పోలిస్తే నేటితరం (జెన్-జెడ్) యువతీయువకులు తమ వ్యక్తిగత జీవితంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారని, తమ స్వయంప్రతిపత్తిని (Agency) దెబ్బతీసే బంధాల నుంచి ధైర్యంగా బయటికి వస్తున్నారని సారా కొనియాడారు. రొమాంటిక్ సోల్‌మేట్స్ కంటే.. తన మనసును పూర్తిగా అర్థం చేసుకునే మంచి స్నేహితులే నిజమైన ఆత్మబంధువులని ఆమె పేర్కొన్నారు. మొత్తానికి పెళ్లి, రిలేషన్‌షిప్స్‌పై సారా టెండూల్కర్ వ్యక్తం చేసిన ఈ ఆధునిక భావాలు నేటి యువతను ఎంతగానో ఆలోచింపజేస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story