Lalit Modi: న్యాయపోరాటంలో గెలిచా.. త్వరలోనే ఇండియాకు వస్తున్నా: లలిత్ మోదీ
లలిత్ మోదీ

Lalit Modi: ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోదీ 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి భారత్‌కు రాబోతున్నారు. 2009 నాటి ఐపీఎల్ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కేసులో అప్పిలేట్ ట్రైబ్యూనల్ ఆయనకు ఊరటనివ్వడంతో ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో స్వదేశానికి రానున్నట్లు వెల్లడించారు.
తీర్పు అనంతరం లలిత్ మోదీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. "గత 16 ఏళ్లుగా సాగిన పోరాటానికి ఈ తీర్పు ముగింపు పలికింది. మీడియాకు, ప్రజలకు నేను మొదటి నుంచీ చెబుతూ వచ్చిన విషయాలే నిజమని తేలాయి. ఐపీఎల్ విజయవంతం కావడమే నా ధ్యేయంగా పనిచేశాను. ఇప్పుడు ఈ అధ్యాయం పూర్తయింది. ఈ ఏడాది చివర్లో నా కుమార్తె బిడ్డకు జన్మనివ్వబోతోంది, ఆ తర్వాత భారత్‌కు రావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని తెలిపారు.
అసలు ఈ కేసు విషయానికి వస్తే... 2009లో దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ టోర్నీని దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఆ సమయంలో నిధుల బదిలీ ప్రక్రియలో ఆర్బీఐ అనుమతులు తీసుకోలేదని, ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని లలిత్ మోదీపై ఈడీ కేసు నమోదు చేసి, రూ.10.65 కోట్ల జరిమానా విధించింది. దీనిపై సుదీర్ఘంగా జరిగిన విచారణ తర్వాత, అప్పిలేట్ ట్రైబ్యూనల్ లలిత్ మోదీకి అనుకూలంగా తీర్పు చెప్పడంతో ఈ వివాదానికి తెరపడింది.

