ICC : భారత్, పాకిస్థాన్ మహిళల క్రికెట్ మ్యాచ్ అంటేనే మైదానంలో ఆవేశం, ఉత్కంఠ సహజం. అయితే ఇటీవల జరిగిన విమెన్స్ ఆసియా కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా అతిగా ప్రవర్తించి ఇప్పుడు ఐసీసీ చేతిలో భారీ మూల్యం చెల్లించుకుంది. భారత ఓపెనర్ షఫాలీ వర్మ వికెట్ తీసిన తర్వాత ఆమె చేసుకున్న సంబరాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

అసలు ఏం జరిగింది?

ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ను సిక్సర్‌తో ప్రారంభించి దూకుడు మీదున్న భారత్ స్టార్ బ్యాటర్ షఫాలీ వర్మను.. ఫాతిమా సనా కాట్ అండ్ బౌల్డ్ రూపంలో అవుట్ చేసింది. అంతవరకు బానే ఉన్నా.. వికెట్ తీసిన ఆనందంలో సనా సరిహద్దులు దాటింది. షఫాలీ వైపు వేలు చూపిస్తూ, పెవిలియన్ వైపు వెళ్లమంటూ హావభావాలు వ్యక్తపరిచింది. మైదానంలో ఆమె ప్రవర్తించిన తీరుపై క్రికెట్ ప్రేమికుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఈ వ్యవహారాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చాలా సీరియస్‌గా తీసుకుంది. ప్రవర్తనా నియమావళిలోని 'లెవల్ 1' నిబంధనను ఉల్లంఘించినందుకుగానూ ఫాతిమా సనాకు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. అంతేకాకుండా ఆమె ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చింది. గడిచిన 24 నెలల వ్యవధిలో సనాకు ఇది రెండో డీమెరిట్ పాయింట్ కావడం గమనార్హం!

గత ఏడాది ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు సనా తొలిసారి డీమెరిట్ పాయింట్ పొందింది. కాగా, ఈ ఆసియా కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు భారత్ ధాటికి కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. ఈ అల్ప లక్ష్యాన్ని భారత మహిళల జట్టు కేవలం 8.4 ఓవర్లలోనే ఛేదించి చిత్తుగా ఓడించింది.ఫలితం ఎలా ఉన్నా మైదానంలో క్రీడాస్ఫూర్తిని విస్మరిస్తే ఐసీసీ ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటుందో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.

Next Story