ICC Men's T20 World Cup Final: టీ20వరల్డ్ కప్ ఫైనల్ పోరు.. భారత్ చరిత్ర సృష్టిస్తుందా.?
భారత్ చరిత్ర సృష్టిస్తుందా.?

ICC Men's T20 World Cup Final: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోయే మహా సంగ్రామం టీ20 ప్రపంచకప్ తుది పోరుకు సర్వం సిద్ధమైంది. మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్ తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా, ఐసీసీ టోర్నీల్లో ఎప్పుడూ అంచనాలకు మించి రాణించే కివీస్ జట్లలో విశ్వవిజేత ఎవరో తేలిపోనుంది.
ముంబై వాంఖడే వేదికగా జరిగిన సెమీ-ఫైనల్లో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి భారత్ దర్జాగా ఫైనల్‌కు దూసుకొచ్చింది. సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్, బుమ్రా అద్భుతమైన స్పెల్ టీమ్ ఇండియాను మరోసారి టైటిల్ వేటలో నిలిపాయి. అటువైపు కోల్‌కతాలో జరిగిన సెమీస్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్, ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే పట్టుదలతో ఉంది. ముఖ్యంగా ఫిన్ అలెన్ ఫామ్ భారత్‌కు సవాలు విసిరేలా ఉంది.
ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీద ఉన్నాయి. అతని 360 డిగ్రీల బ్యాటింగ్ ఈ పిచ్‌పై కీలకం కానుంది. ఇక బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిల మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయలేం. ఐసీసీ టోర్నీల్లో భారత్‌ను ఓడించిన రికార్డ్ కివీస్‌కు ఉంది. శాంట్నర్ స్పిన్, కివీస్ ఫీల్డింగ్ భారత్‌కు కఠిన పరీక్ష పెట్టబోతున్నాయి.
కోట్లాది మంది భారతీయుల ప్రార్థనలు, అందరి ఆశ ఒక్కటే.. మన దేశం మరోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడాలి! మరి న్యూజిలాండ్ తన తొలి టీ20 టైటిల్ గెలుస్తుందా? లేక భారత్ చరిత్ర సృష్టిస్తుందా? రెండు రోజుల్లో తేలిపోనుంది. గెలుపు ఎవరిదైనా క్రికెట్ ప్రేమికులకు మాత్రం ఇది పండగే!

