తిరస్కరించిన ఐసీసీ

ICC : ఆసియా కప్‌ మ్యాచ్ సందర్భంగా భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ వివాదంలో భాగంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను బాధ్యుడిగా పేర్కొంటూ అతణ్ని తప్పించాలని పీసీబీ కోరినప్పటికీ, ఐసీసీ ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఐసీసీ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. "భారత ఆటగాళ్లు కరచలనం చేయకపోవడంలో మ్యాచ్ రిఫరీకి ఎలాంటి ప్రమేయం లేదు" అని స్పష్టం చేశారు. దీంతో పైక్రాఫ్ట్‌ను తొలగించలేమని పీసీబీకి తేల్చి చెప్పినట్లు తెలిపారు.

పీసీబీ ఆరోపణల ప్రకారం.. టాస్ సమయంలో భారత కెప్టెన్‌తో కరచాలనం ఉండదని పైక్రాఫ్టే తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పారని, అందుకే అతడిపై చర్యలు తీసుకోవాలని పీసీబీ డిమాండ్ చేసింది. ఒకవేళ తమ డిమాండ్ నెరవేరకపోతే ఆసియా కప్‌ను బహిష్కరిస్తామని కూడా పీసీబీ హెచ్చరించింది.

భారత్ వైఖరిపై వివాదం:

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడటంపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్‌తో కరచాలనం చేయలేదు. అంతేకాకుండా మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. దీన్ని పాకిస్థాన్ ఆటగాళ్లు అవమానంగా భావించారు. అయితే భారత్ ఈ టోర్నీలో పాక్‌తో జరిపే తదుపరి మ్యాచ్‌లలోనూ ఇదే వైఖరిని కొనసాగించనుంది.

పీసీబీ వెనుకడుగు:

ఐసీసీ తన డిమాండ్‌ను తిరస్కరించినప్పటికీ ఆసియా కప్‌ నుంచి తప్పుకుంటామని పీసీబీ ఇచ్చిన బెదిరింపు మౌనంగానే ఉండిపోయింది. టోర్నమెంట్ మధ్యలో వైదొలిగితే ఎదురయ్యే ఆర్థిక నష్టాల గురించి పీసీబీకి బాగా తెలుసు. ఒకవేళ పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తే, టోర్నీ ఆదాయంలో తమకు దక్కాల్సిన 15 శాతం వాటాను కోల్పోతుంది. ఇది సుమారు రూ.105-140 కోట్ల మేర ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న పీసీబీకి అంత పెద్ద మొత్తాన్ని వదులుకునే పరిస్థితి లేదు. అందుకే ఈ విషయంలో పీసీబీ వెనుకడుగు వేసిందని స్పష్టమవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story