ICC Women's ODI World Cup 2025: జయహో జెమీమా.. ఆస్ట్రేలియాపై భారత్ సంచలన విజయం
ఆస్ట్రేలియాపై భారత్ సంచలన విజయం

ICC Women's ODI World Cup 2025: అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో భారత జట్టు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఏడుసార్లు ఛాంపియన్, పటిష్టమైన ఆస్ట్రేలియా మహిళల జట్టును సెమీఫైనల్‌లో చిత్తు చేసి, భారత జట్టు ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్ (127 నాటౌట్) ఈ చారిత్రక విజయాన్ని అందించింది.
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో, మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 338 పరుగులు (49.5 ఓవర్లలో ఆలౌట్) చేసింది. ఆసీస్ తరఫున ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119) అద్భుత శతకంతో పాటు ఎల్లీస్ పెర్రీ (77), ఆష్లీ గార్డనర్ (63) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో శ్రీ చరణి, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు.
339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం భారత జట్టుకు పెను సవాలుగా మారింది. అయితే, భారత బ్యాటర్లు పట్టుదలను ప్రదర్శించారు. 48.3 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయవంతమైన రన్ ఛేజింగ్ రికార్డును ఈ విజయంతో భారత జట్టు తన పేరిట లిఖించుకుంది.
భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే షెఫాలీ వర్మ, స్మృతి మంధాన వికెట్లను కోల్పోవడంతో జట్టు ఒత్తిడిలోకి వెళ్లింది. ఈ దశలో వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (134 బంతుల్లో 127 నాటౌట్, 14 ఫోర్లు) క్రీజులో పాతుకుపోయింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89) తో కలిసి జెమీమా మూడో వికెట్‌కు ఏకంగా 167 పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వీరిద్దరూ రన్-రేట్ తగ్గకుండా చూసుకోవడంతో పాటు, ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. హర్మన్ అవుటైన తర్వాత కూడా జెమీమా సంయమనం కోల్పోకుండా, రిచా ఘోష్, దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్‌తో కలిసి విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. జెమీమా ఆఖరి వరకు నాటౌట్‌గా నిలవడం విశేషం.








