సెమీఫైనల్లో భారత్ vs ఆస్ట్రేలియా

ICC Women's ODI World Cup 2025: మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 లో ఆస్ట్రేలియా,భారత్ జట్లు సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవగా, భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ప్రపంచ కప్ నిబంధనల ప్రకారం, పట్టికలో నెం. 1 జట్టు నెం. 4 జట్టుతో సెమీఫైనల్ ఆడుతుంది. గురువారం అక్టోబర్ 30న డా. డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ, నవీ ముంబైలో మధ్యాహ్నం 3:00 గంటలకు (భారత కాలమానం) మ్యాచ్ జరగనుంది.

నవీ ముంబైలో వర్షం పడే అవకాశం ఉన్నందున, ఒకవేళ మ్యాచ్ షెడ్యూల్ చేసిన రోజున పూర్తి కాకపోతే, మ్యాచ్ కొనసాగించడానికి రిజర్వ్ డే (అక్టోబర్ 31, 2025) కేటాయించబడింది. ఒకవేళ రిజర్వ్ డే నాడు కూడా మ్యాచ్ రద్దయితే (నో రిజల్ట్), అప్పుడు లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు (ఈ సందర్భంలో ఆస్ట్రేలియా) ఫైనల్‌కు చేరుకుంటుంది. సెమీఫైనల్ 1 మ్యాచ్ బుధవారం అక్టోబర్ 29న గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. మధ్యాహ్నం 3:00 గంటలకు మ్యాచ్ జరగనుంది.

మహిళల ప్రపంచ కప్ 2025లో భారత్, బంగ్లాదేశ్ మధ్య నిన్న జరిగిన చివరి లీగ్ దశ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది . వర్షం కారణంగా ఈ మ్యాచ్ చాలా ఆలస్యంగా మొదలవడంతో ఓవర్లను 27కు తగ్గించారు.

భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం తర్వాత బంగ్లాదేశ్ 27 ఓవర్లలో 9 వికెట్లకు 119 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ (3/30), శ్రీ చరణి (2/23) అద్భుతంగా రాణించారు.

డక్ వర్త్-లూయిస్ (DLS) పద్ధతి ప్రకారం భారత్‌కు 27 ఓవర్లలో 126 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.స్మృతి మంధాన (34 నాటౌట్), అమన్‌జోత్ కౌర్ (15 నాటౌట్) ధాటిగా ఆడి, భారత్‌ను 8.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 57 పరుగులకు చేర్చారు. అయితే, మళ్లీ వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఫలితం తేలకపోవడంతో ఇరు జట్లకు చెరో ఒక పాయింట్ లభించింది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి, సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. అక్టోబర్ 30న ఆస్ట్రేలియాతో తలపడనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story