తొలిసారిగా మహిళా ప్యానెల్‌తో మెగా టోర్నీ

ICC Women's ODI World Cup: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే తొలిసారిగా పూర్తిగా మహిళా అంపైర్లు, మ్యాచ్ రెఫరీలతో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ఐసీసీ ఛైర్మన్ జైషా ప్రశంసించారు. గతంలో మహిళల టీ20 వరల్డ్ కప్, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ మహిళా అంపైర్లను, రిఫరీలను ఐసీసీ నియమించినప్పటికీ, వన్డే వరల్డ్ కప్‌లో మాత్రం ఇది మొదటిసారి.

ఈ వరల్డ్ కప్ సెప్టెంబర్ 30 నుంచి భారత్, శ్రీలంక ఉమ్మడి ఆతిథ్యంలో జరగనుంది. మొత్తం 14 మంది అంపైర్లు, నలుగురు మ్యాచ్ రెఫరీలు ఈ టోర్నీలో తమ సేవలను అందించనున్నారు. అంపైర్లలో క్లైర్ పోలోసాక్, జాక్వెలిన్ విలియమ్స్, స్యూ రెడ్‌ఫెర్న్‌లకు ఇది మూడో మహిళల ప్రపంచ కప్ కాగా, లారెన్ అగెన్‌బాగ్, కిమ్ కాటన్‌లకు ఇది రెండో టోర్నీ. మ్యాచ్ రెఫరీ ప్యానెల్‌లో ట్రూడీ ఆండర్సన్, షాండ్రే ఫ్రిట్జ్, జీఎస్ లక్ష్మి, మిచెల్ పెరీరా సభ్యులుగా ఉన్నారు.

ఐసీసీ ఛైర్మన్ జైషా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ముందడుగు మహిళల క్రికెట్ ప్రయాణంలో ఒక అద్భుత ఘట్టమని పేర్కొన్నారు. "ఇది కొత్త ఒరవడికి మార్గం సుగమం చేస్తుందని మేము ఆశిస్తున్నాం. పూర్తిగా మహిళలతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేయడం కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు. క్రికెట్‌లో స్త్రీ, పురుష సమానత్వాన్ని పెంపొందించడానికి ఐసీసీ చూపుతున్న నిబద్ధతకు ఇది ప్రతిబింబం" అని ఆయన తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story