ICC Women's T20 World Cup 2026: విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన బెత్ మూనీ
బెత్ మూనీ

ICC Women's T20 World Cup 2026: లండన్‌లోని లార్డ్స్ మైదానంలో నిన్న (ఆదివారం) ఇంగ్లాండ్‌తో జరిగిన ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో ఆస్ట్రేలియా ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగింది. 49 బంతుల్లో 10 ఫోర్లతో 64 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందించడమే కాకుండా, రికార్డు స్థాయిలో 7వ సారి ప్రపంచకప్ ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఈ మ్యాచ్‌లో చేసిన హాఫ్ సెంచరీతో బెత్ మూనీ పురుషుల క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఒక అరుదైన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి, సరికొత్త చరిత్ర సృష్టించింది.
విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు..
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలో (పురుషుల, మహిళల క్రికెట్ కలిపి) మూడు సార్లు 50 కంటే ఎక్కువ (50-plus) పరుగులు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి క్రికెటర్‌గా బెత్ మూనీ సరికొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు ఈ రికార్డు భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో కోహ్లీ రెండు సార్లు హాఫ్ సెంచరీలు సాధించాడు. కోహ్లీతో పాటు శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర, వెస్టిండీస్ మాజీ ఆటగాడు మార్లన్ శ్యామ్యుల్స్ కూడా ఫైనల్స్‌లో రెండేసి హాఫ్ సెంచరీలు చేశారు. ఇప్పుడు మూనీ వీరి ముగ్గురినీ వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
బెత్ మూనీ గతంలో ఆడిన టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ స్కోర్లు:
2020 ఫైనల్ (మెల్‌బోర్న్): భారత్‌పై 78 నాటౌట్
2023 ఫైనల్ (కేప్‌టౌన్): దక్షిణాఫ్రికాపై 74 నాటౌట్
2026 ఫైనల్ (లండన్): ఇంగ్లాండ్‌పై 64 పరుగులు
మహిళల క్రికెట్ చరిత్రలో మరే ఇతర బ్యాటర్ కూడా ప్రపంచకప్ ఫైనల్లో ఒకటి కంటే ఎక్కువసార్లు 50 ప్లస్ స్కోరు చేయకపోవడం విశేషం.
ఫైనల్స్ లో అత్యధిక పరుగుల రికార్డు కూడా..
ఈ ఇన్నింగ్స్ ద్వారా టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా బెత్ మూనీ సరికొత్త మైలురాయిని అందుకుంది. ఆమె ఐదు ప్రపంచకప్ ఫైనల్స్ మ్యాచ్‌లలో నాలుగు ఇన్నింగ్స్ ఆడి మొత్తం 230 పరుగులు సాధించింది.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ కంటే 55 పరుగులు, వెస్టిండీస్ స్టార్ మార్లన్ శ్యామ్యుల్స్ కంటే 67 పరుగులు ఎక్కువగా చేసి మూనీ టాప్‌లో నిలిచింది. నిన్నటి ఫైనల్ మ్యాచ్‌లో కనబరిచిన అద్భుత ప్రదర్శనకు గాను బెత్ మూనీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుతో పాటు, టోర్నీ అంతటా రాణించినందుకు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును కూడా సొంతం చేసుకుంది.

