వన్డే క్రికెట్ పరిస్థితి ఏంటి.?

ODI Cricket: వన్డే క్రికెట్ భవిష్యత్తుపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన యూట్యూబ్ ఛానెల్ 'యాష్ కీ బాత్' (Ash Ki Baat) ద్వారా ఆయన వన్డే ఫార్మాట్ మనుగడపై తన ఆందోళనను వ్యక్తం చేశారు.వన్డే క్రికెట్ ప్రస్తుతం కష్టకాలంలో ఉందని, ఇది మెల్లగా అంతరించిపోయే దశకు చేరుకుంటోందని అశ్విన్ హెచ్చరించారు. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్ మనుగడ సాగించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం వన్డే క్రికెట్‌కు ఉన్న ఆదరణ ప్రధానంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్ల వల్లే ఉందని అశ్విన్ పేర్కొన్నారు.వీరిద్దరూ విజయ్ హజారే ట్రోఫీ (డొమెస్టిక్ వన్డేలు) ఆడినప్పుడు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపారని, కానీ వారు తప్పుకున్నాక వన్డేలను చూసే వారు ఎవరు ఉంటారని ఆయన ప్రశ్నించారు.స్టార్ హోదా ఉన్న ఆటగాళ్లు లేకపోతే ఈ ఫార్మాట్ తన ప్రాధాన్యతను కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఐసీసీ ప్రతి ఏటా ఒక మెగా టోర్నమెంట్‌ను (వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ) నిర్వహించడం వల్ల వాటికున్న విలువ తగ్గిపోతోందని అశ్విన్ విమర్శించారు.కేవలం ఆదాయం కోసమే టోర్నీలు నిర్వహించడం కాకుండా, FIFA (ఫుట్‌బాల్) తరహాలో నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే ప్రపంచకప్ నిర్వహించాలని సూచించారు.మిగిలిన సమయంలో క్లబ్/లీగ్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇస్తేనే వన్డే వరల్డ్ కప్‌కు ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పారు.

పూర్వం వన్డే క్రికెట్ ఎంతో ఆసక్తికరంగా ఉండేదని, ఎం.ఎస్. ధోనీ లాంటి ఆటగాళ్లు ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆఖర్లో మెరుపులు మెరిపించేవారని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు రెండు కొత్త బంతులు, ఫీల్డింగ్ నిబంధనల వల్ల ఆట కేవలం 'బాదుడు' లేదా 'కుప్పకూలడం' అన్నట్లుగా తయారైందని విశ్లేషించారు."వన్డే క్రికెట్‌ను కాపాడుకోవాలంటే కేవలం నాలుగేళ్లకు ఒకసారి ప్రపంచకప్ మాత్రమే నిర్వహించాలి. మిగిలిన సమయంలో టీ20 లీగ్‌లు ఆడుకోవచ్చు. అప్పుడే వరల్డ్ కప్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు."

PolitEnt Media

PolitEnt Media

Next Story