Irfan Pathan: రోహిత్, కోహ్లీ వరల్డ్ కప్ ఆడాలంటే అది తప్పక చేయాలి - ఇర్ఫాన్ పఠాన్
వరల్డ్ కప్ ఆడాలంటే అది తప్పక చేయాలి - ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan: భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలనుకుంటే వారికి మ్యాచ్ ప్రాక్టీస్ అతిపెద్ద సవాలుగా మారుతుందని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఈ సమస్యను అధిగమించాలంటే వారు తప్పకుండా దేశవాళీ క్రికెట్ ఆడాలని ఆయన సూచించాడు. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న నేపథ్యంలో వారికి రెగ్యులర్ మ్యాచ్ ఆడటం కీలకంగా మారుతుందని పఠాన్ నొక్కి చెప్పారు.
పఠాన్ కీలక వ్యాఖ్యలు
రోహిత్ తన ఫిట్‌నెస్‌పై బాగా కృషి చేస్తున్నాడు. అతడు దానిపైనే దృష్టి పెట్టాడు. అయితే రెగ్యులర్ క్రికెట్ ఆడకపోతే కొంత ఆట సమయాన్ని కేటాయించుకుని దేశవాళీ క్రికెట్ ఆడాలి. రోహిత్, కోహ్లీ అపారమైన అనుభవం ఉన్న పెద్ద ఆటగాళ్లు. ఏం చేయాలో వారికి తెలుసు. కానీ సమస్య ఏంటంటే.. వారు టీ20లు కూడా ఆడటం లేదు. ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడే వన్డేలకు, టోర్నీ ఆరంభానికి మధ్య చాలా విరామం ఉంది. వరల్డ్ కప్ కోసం ఫిట్‌గా ఉండటానికి వారు క్రమం తప్పకుండా మ్యాచ్‌లు ఆడటం అవసరం. అప్పుడే 2027 ప్రపంచకప్ ఆడాలనే రోహిత్, కోహ్లీ కల నెరవేరుతుందని ఇర్ఫాన్ పఠాన్ స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించని రోహిత్, విరాట్ త్వరలో తమ అభిమానులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 19 నుంచి ఆసీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు* వీరిద్దరిని ఎంపిక చేశారు. అయితే ఈ సిరీస్‌కు రోహిత్‌ను కెప్టెన్‌గా తొలగించి శుభ్‌మన్ గిల్‌కు ఆ బాధ్యతలు కట్టబెట్టారు.
