అమిత్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు

Amit Mishra: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా, తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలను నిస్సందేహంగా పంచుకున్నారు. తాను కెప్టెన్‌కు ఇష్టమైన ఆటగాడిని కాకపోవడమే జాతీయ జట్టులో ఎక్కువ అవకాశాలు రాకపోవడానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు. "నా కెరీర్‌లో అత్యంత నిరుత్సాహపరిచే విషయమదే. కొన్నిసార్లు జట్టులోకి రావడం, బయటకు పోవడం సహజమే. అయితే కొందరికి మాత్రం నిరంతరంగా అవకాశాలు వస్తుంటాయి. దానికి కారణం వారు కెప్టెన్‌కు ఇష్టమైన వ్యక్తులు కావడమే" అని మిశ్రా అన్నారు. అయితే, తాను ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండేవాడినని, ఫిట్‌నెస్, బ్యాటింగ్‌, బౌలింగ్‌.. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రయత్నించానని తెలిపారు. భారత జట్టుకు ఎప్పుడు అవకాశం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకున్నానని, ఆ విషయంలో తాను సంతోషంగానే ఉంటానని మిశ్రా పేర్కొన్నారు.

ఐపీఎల్ హ్యాట్రిక్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది:

మిశ్రా 2003లో అరంగేట్రం చేసి, సౌరభ్‌ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, ధోనీ, విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడాడు. ఐపీఎల్‌లో మూడుసార్లు హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా ఆయన పేరిట రికార్డు ఉంది. "నాకు జీవితాంతం గుర్తుండిపోయే క్షణమంటే 2008 ఐపీఎల్‌ సీజన్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌పై హ్యాట్రిక్ తీయడం. అప్పటి వరకు దేశవాళీలో నిలకడగా ఆడుతున్నా, జాతీయ జట్టులో మళ్లీ అవకాశం రాలేదు. ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌తో మెరిసిన తర్వాతే మళ్లీ టీమ్ఇండియాలో టీ20 ఫార్మాట్‌లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. నా సత్తా చాటుకున్నాను" అని అమిత్ మిశ్రా గుర్తుచేసుకున్నారు. చివరిసారిగా 2017లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మిశ్రా, 2024లో ఐపీఎల్‌లో చివరి మ్యాచ్ ఆడారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story