IND A vs SL A: దంబుల్లా వేదికగా శ్రీలంక ఎ, భారత్‌ ఎ జట్ల మధ్య ట్రై సిరీస్ సమరం హోరాహోరీగా సాగుతోంది. ఈ తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్ ‘ఎ’ జట్టు కెప్టెన్ ఏమాత్రం తడుముకోకుండా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనే అంచనాతో బరిలోకి దిగిన టీమిండియాకు.. ఆరంభంలోనే ఊహించని షాక్ తగిలింది.

శ్రీలంక బౌలర్లు కరెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో దాడి చేస్తూ భారత ఓపెనర్లను తీవ్రంగా ఒత్తిడిలోకి నెట్టారు. జట్టు స్కోరు కేవలం 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 14 పరుగులు చేసి వెనుదిరిగాడు. 12 బంతుల్లో 3 ఫోర్లతో మంచి టచ్‌లోనే కనిపించినా.. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో మహ్మద్ షిరాజ్ బౌలింగ్‌లో సహాన్ అరచ్చిగేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

అయితే, ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే భారత్‌కు మరో గట్టి షాక్ తగిలింది. మరో ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. మరుసటి ఓవర్ తొలి బంతికే, అంటే 4.1 ఓవర్ వద్ద కరుణరత్నే బౌలింగ్‌లో సమరవిక్రమకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీనితో భారత్ ‘ఎ’ జట్టు కేవలం 16 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ప్రియాంశ్ ఆర్య 32 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ లంక బౌలర్లను ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ ‘ఎ’ జట్టు 21 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రుతురాజ్ గైక్వాడ్ 33 , తిలక్ వర్మ 9 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story