India Bids: 2030 కామన్ వెల్త్ కు భారత్ బిడ్
భారత్ బిడ్

India Bids: 2030 కామన్ వెల్త్ గేమ్స్ కోసం భారత్ బిడ్ వేసింది. భారత ఒలింపిక్ సంఘం (IOA) 2030 కామన్ వెల్త్ గేమ్స్‌ను నిర్వహించడానికి అధికారికంగా బిడ్‌ను ఆమోదించింది. భారత్ లో అహ్మదాబాద్‌ను ప్రతిపాదించారు. భువనేశ్వర్, ఢిల్లీ వంటి నగరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. గతంలో రేసులో ఉన్న కెనడా వైదొలగడంతో భారతదేశానికి అవకాశాలు పెరిగాయి. 2025 నవంబర్ చివరి వారంలో గ్లాస్గోలో జరిగే కామన్ వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో 2030 గేమ్స్ ఆతిథ్య దేశాన్ని ప్రకటిస్తారు.
భారత్ గతంలో 2010లో ఢిల్లీలో కామన్ వెల్త్ గేమ్స్‌ను నిర్వహించింది. ఈసారి మళ్లీ ఆతిథ్యం దక్కించుకుంటే, అహ్మదాబాద్‌ను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు.
2030 కామన్ వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే భారత్ బిడ్‌కు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ఆమోదం తెలపడంపై IOA ప్రెసిడెంట్ పీటీ ఉష సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం అందరి ఉమ్మడి కృషి అని ఆమె తెలిపారు. ఈ క్రీడలను నిర్వహించడానికి అహ్మదాబాద్, భువనేశ్వర్ వంటి నగరాల్లో మంచి సౌకర్యాలు ఉన్నాయని, ఆతిథ్య నగరాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు.
IOAలో అంతర్గత విభేదాల కారణంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) నిలిపివేసిన 'ఒలింపిక్ సాలిడారిటీ గ్రాంట్' తిరిగి వస్తుందని ఉష ఆశాభావం వ్యక్తం చేశారు. విభేదాలు సద్దుమణగడంతో, ఈ నిధులు తిరిగి విడుదలవుతాయని ఆమె భావించారు.

